శాసనమండలిలో కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్సీ

Kavitha Turns Emotional: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించినప్పటి నుంచి తనపై పరిమితులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా కాలరాస్తారనే బాధతోనే ఈ మాటలు ఆమె శాసనమండలిలో ఆవేదనతో చెప్పారు. మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.

‘‘బీఆర్‌ఎస్‌ పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా పూర్తి మనస్ఫూర్తిగా నిర్వహించాను. పార్టీలో ప్రశ్నలు లేవనెత్తితే కక్షలు పెట్టారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుంది? పార్టీ నన్ను తీవ్రంగా అవమానించింది. ఈడీ, సీబీఐ కేసులతో పోరాడుతున్న సమయంలో నాకు మద్దతు ఇవ్వలేదు. కేసీఆర్‌పై కక్ష సాధింపు కోసం భాజపా నన్ను జైలుకు పంపించింది.

పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రశ్నలు లేవనెత్తాను. అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్‌ భవనాల వరకు అన్నింటిలోనూ అవినీతి జరిగింది. ఒక్క వర్షానికే సిద్దిపేట కలెక్టరేట్‌ కొట్టుకుపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్లు ఇవ్వాలని పార్టీలో డిమాండ్‌ చేశాను. కానీ అమరవీరులను బీఆర్‌ఎస్‌ ఎన్నడూ గౌరవించలేదు. నీళ్లు, నిధులు, నియామకాల హామీలను కూడా పట్టించుకోలేదు.

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని పదేపదే కోరాను. ఆ ఫ్యాక్టరీ తెరవకపోవడం నాకు మరింత అవమానకరం. కేసీఆర్‌ను నేరుగా ప్రశ్నించే ధైర్యం నాకు మాత్రమే ఉందని అనేక అంశాలపై మాట్లాడాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోపణలపై పార్టీలో ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. అందుకే ప్రెస్‌మీట్‌ నిర్వహించి బహిరంగంగా మాట్లాడాను. అవినీతిలో పాల్గొన్నవారి పేర్లు చెప్పాను’’ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

జాగృతి రాజకీయ పార్టీగా మారనుంది

ఈ సందర్భంగా కవిత మరింత కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోందని పేర్కొన్నారు. ‘‘ఉద్యమ ద్రోహులకు బీఆర్‌ఎస్‌ పునరావాస కేంద్రంగా మారింది. నాది ఆస్తుల కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం పోరాటం. రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రానుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తాం. అవమానాల భారంతో పుట్టింటి బంధాలను తెంచుకుని మీ ముందుకు వస్తున్నాను.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాం. వ్యక్తిగతంగా సభ నుంచి వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను’’ అని కవిత ధీమా వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story