MP Dharmapuri Arvind: తెలంగాణలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన తర్వాతే క్రాప్ హాలిడే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. గడ్డం పెంచుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉందని కూడా పేర్కొన్నారు.

2029 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా గల్లంతు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టిస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, ముఖ్యంగా పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.50 వేల ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ హామీపై బాండ్ పేపర్ రాసి ఇస్తానని కూడా అన్నారు.

తెలంగాణలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలు నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించిన అరవింద్.. నిజామాబాద్‌లోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం విషయంలో త్వరలో ఆందోళన చేపడతామని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, పసుపు ధరలు, మాధవనగర్ ఆర్వోబీ అంశాలపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Next Story