కేసీఆర్ హైకోర్టులో వాదన

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంలో తానే బాధ్యుడని ఏ ప్రాతిపదికన చెప్పారో వివరించాలని డిమాండ్

ప్రభుత్వ రికార్డులతోనే నిర్ణయం.. వ్యతిరేక సాక్షులు ఎవరో తెలియజేయలేదు


KCR Argues in High Court: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రణాళిక, డిజైన్‌ నుంచి అమలు వరకు అన్ని దశలకు ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని జస్టిస్‌ పి.సి. ఘోష్ కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్ధారించిందో స్పష్టంగా చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) హైకోర్టుకు నివేదించారు.

శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగినప్పుడు కేసీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. కమిషన్‌ నిర్ధారణ ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగానే జరిగిందని, అయితే ఆ రికార్డుల్లో ఒక్క కాగితం కూడా తనకు అందజేయలేదని విమర్శించారు. వ్యతిరేకంగా ఎవరు ఫిర్యాదు చేశారు లేదా ఆరోపణలు చేశారో కమిషన్‌ తెలియజేయలేదని, అటువంటి సాక్షులను ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

ప్రాజెక్టు స్థల ఎంపిక నుంచి డిజైన్‌, టెండర్లు, అమలు వరకు అన్నింటికీ తాను బాధ్యుడని కమిషన్‌ నివేదికలో పేర్కొందని, దీంతో ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారని, అయితే ఇలాంటి తీర్పుకు రావడానికి ముందు సెక్షన్‌ 8(బి), 8(సి) ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ కోరాల్సి ఉండగా అలా చేయలేదని ఆరోపించారు. సాక్షిగా పిలిచిన వ్యక్తిని దోషిగా ముద్ర వేయడం తప్పని వాదించారు.

కమిషన్‌ ఏర్పాటు జీవో 6ను సవాలు చేస్తూ కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌, మాజీ ఐఏఎస్‌ ఎస్‌.కె. జోషి దాఖలు చేసిన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.

కమిషన్‌ నివేదిక రాజకీయ ఉద్దేశాలతో తయారైందని, దాన్ని అసెంబ్లీలో చర్చించకుండా మీడియాకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వెల్లడించారని కేసీఆర్‌ తరఫు వాదనల్లో పేర్కొన్నారు. కమిషన్‌ ఏర్పాటు, నివేదికను రద్దు చేయాలని కోరారు.

స్మితా సభర్వాల్‌ తరఫున కూడా నిబంధనలకు అనుగుణంగానే విధులు నిర్వహించామని, ఆమెపై ఎలాంటి ఆరోపణలూ లేవని వాదించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story