రానున్న రెండేళ్లు ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం... డిజిటల్‌ సభ్యత్వ నమోదు

KCR Calls: రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా వారీగా వివిధ సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిపై ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి ఉద్యమించాలని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, కీలక నేతలతో ఆయన ఆరు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం, శనగలు, మక్కలు పండించే రైతుల సమస్యలు, ప్రభుత్వం కొనుగోళ్లలో అనుసరిస్తున్న వైఖరి, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ జరిగింది.

కేసీఆర్‌ మాట్లాడుతూ, “అన్నదాతలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. పార్టీ వారికి అండగా నిలబడాలి. రానున్న రెండేళ్లు ప్రజల మధ్య ఉండి పోరాటం చేయాలి. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఓటరు జాబితాల సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌)పై ప్రత్యేక దృష్టి సారించాలి” అని దిశా నిర్దేశం చేశారు.

డిజిటల్‌ సభ్యత్వ నమోదు:

పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి డిజిటల్‌ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసి, జిల్లా కేంద్రాల్లో సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇవ్వాలి. మండలాలు, పురపాలికలకు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కమిటీ నుంచి సమన్వయకర్తలను నియమించాలి. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులకే అవకాశాలు ఇవ్వాలి. బంధువులకు పట్టం కట్టకూడదని స్పష్టం చేశారు.

బలహీన నియోజకవర్గాలపై దృష్టి:

కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలం తగ్గినట్లు కనిపిస్తోందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైతే భారీ బహిరంగ సభలు నిర్వహించాలి. కొత్త నాయకులను తయారు చేయాలి. బలమైన వర్గాల నేతలను పార్టీలోకి ఆహ్వానించాలి. త్వరలో జిల్లాల వారీగా పార్టీ స్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు.

స్థానిక ఎన్నికలకు సన్నాహాలు:

ప్రాదేశిక సంస్థలు (పరిషత్‌), జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, సిద్దిపేట, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే కార్యకర్తలను సన్నాహాలు చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీలో మెజారిటీ డివిజన్లు గెలవడానికి వ్యూహాలు రూపొందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జీవన్‌రెడ్డి, ఎస్‌. మధుసూదనాచారి, ఎల్‌. రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌, టి. రవీందర్‌రావు, డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డా. బండా ప్రకాశ్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వి. గంగాధర్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, సోమా భరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి మార్గం సుగమం చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story