TPCC Leader Ramya Rao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంది: టీపీసీసీ నేత రమ్యా రావు
టీపీసీసీ నేత రమ్యా రావు

TPCC Leader Ramya Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తూ ప్రజల మద్దతు పొందుతుంటే.. ‘22ఏ’ అంటూ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్‌పై టీపీసీసీ సీనియర్ నేత రమ్యా రావు మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రమ్యా రావు ఇలా అన్నారు: “మాకు వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు. నేను కేసీఆర్ సొంత అన్న బిడ్డను. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా ఆ వందల ఎకరాలలో మా భూమి ఎక్కడ ఉంది? నేను, కవిత ఇద్దరం ఇంటి వాళ్లం. మేము కాకుండా సంబంధం లేని సంతోష్ రావు కేసీఆర్ దగ్గర ఎందుకు ఉంటున్నాడు? ఆయన అడ్డగోలుగా సంపాదించి నన్ను, కవితను ఇంటి నుంచి బయటకు పంపిస్తే నువ్వు (కేటీఆర్) ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నీకు సంతోష్ బినామీనా? ఎందుకు భయపడుతున్నావు?”
సంతోష్ రావుకు 2013లో క్వారీలో 25 శాతం వాటా ఉండేదని, 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు ముంపుకు గురైందంటూ సంతోష్ ఇంటి వాళ్లందరూ ఇళ్ల పట్టాలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. కుదురుపాక గ్రామానికి సంబంధం లేని వారు కూడా ప్లాట్లు తీసుకున్నారని విమర్శించారు. ఆ గ్రామంలో ఒక్క సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి 8 ప్లాట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. “2018లో సంతోష్ రావుకు రాజ్యసభలో అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంగా సంతోష్ ఒక్క ప్లాట్‌ను మాత్రమే అఫిడవిట్‌లో చూపించారు. 8 ప్లాట్లు తీసుకుని ఒక్క ప్లాటే ఎలా చూపించారు? 200 గజాల భూమిని కూడా వదలకుండా అడ్డగోలు అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా కుదురుపాక గ్రామంలో మెయిన్ రోడ్డులో బాధితుల భూములను అడ్డగోలుగా కొన్నాడు” అని రమ్యా రావు తెలిపారు.
కరీంనగర్‌లో ఉన్నప్పుడు సంతోష్ రావుకు చెప్పులు కూడా లేవని, ఇంట్లో పనిచేసే ఒక పనిపిల్ల డబ్బును కూడా ఆయన గుంజుకున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి మనిషికి ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. “మార్కుక్ గ్రామంలో ఆయనకు 9 ఎకరాల భూమి ఎలా వచ్చింది? బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో భూమి, ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కరీంనగర్‌లో సింగిల్ బెడ్ రూమ్‌లో ఉన్న ఆయనకు 2018 తర్వాత కొండాపూర్, బంజారాహిల్స్‌లో ఆస్తులు ఎలా వచ్చాయి?” అని నిలదీశారు. అక్కను, చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపి సంతోష్ రావును ఎందుకు పక్కన పెట్టుకున్నారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సంతోష్ భార్య రోహిణి పేరు మీద నానక్ రామ్‌గూడలో పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఎలా వచ్చిందని కూడా ఆమె అడిగారు.
ఈ విధంగా రమ్యా రావు బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

