హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స

  • షుగర్, సోడియం స్థాయుల్లో హెచ్చు తగ్గులే అస్వస్ధతకు కారణం
  • ఎర్రవల్లి ఫాం హౌస్‌కు వెళ్ళిన కేటీఆర్, హరీశ్ రావు ఇతర నేతలు..
  • అవసరమైతే హైదరాబాద్‌కు తరలించే యోచనలో కుటుంబ సభ్యులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఎర్రవల్లి లోని తన ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం వెంటనే అక్కడికి చేరుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ రక్తంలో చక్కెర, సోడియం స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్య బృందం ఆయనకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తండ్రి అనారోగ్య వార్త తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన కుమారుడు హిమాన్షుతో కలిసి స్వయంగా కారు నడుపుకుంటూ ఫాం హౌస్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఎర్రవల్లికి వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఫాం హౌస్‌ లోనే ఉండి కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తోంది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడే ఉండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోతే, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Politent News Web 1

Politent News Web 1

Next Story