పాలమూరు-రంగారెడ్డిపై గట్టి పోరాటం

KCR Set to Attend Assembly: భారాస అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 29 నుంచి ప్రారంభమవుతున్న సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఏ ఎజెండా ఖరారు చేస్తుందో ఆధారంగా ముందుకు వెళతానని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

శుక్రవారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో భారాస నాయకులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీలో పార్టీ వ్యూహంపై దిశానిర్దేశం చేస్తూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలోనూ, క్షేత్రస్థాయిలోనూ బలమైన పోరాటం చేయాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల అనంతరం మహబూబ్‌నగర్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశాలు కనీసం 15 రోజులు జరిగేలా అధికార పక్షంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్ చేశారు.

తెలంగాణకు ద్రోహమే చేస్తోంది కాంగ్రెస్: సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే చేసింది. భారాస తప్ప ఇతర పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. నీటి హక్కులపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడదాం. ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు చేపట్టదాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి గట్టిగా పట్టుబట్టదాం’’ అని పేర్కొన్నారు.

రైతుల సమస్యలపై ఫోకస్: రాష్ట్రంలో రైతులు ఎరువుల కొరత, బోనస్ లేకపోవడం, కరెంటు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఫార్మాసిటీ, హిల్‌ఫోర్ట్ పాలసీపై సమగ్ర చర్చ జరిగేలా డిమాండ్ చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయాలని సూచించారు.

బహిరంగ సభకు సంబంధించి వాల్ పోస్టర్లు, కరపత్రాలు సిద్ధం చేయడం, స్థానిక సమావేశాలు నిర్వహించడం, నల్గొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భారీ జనసమీకరణ చేయడంపై చర్చ జరిగింది. ఈ నిర్ణయాలతో భారాస మళ్లీ ఆక్టివ్ అవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated On 27 Dec 2025 4:35 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story