Key Breakthrough on Metro Phase-2: మెట్రో ఫేజ్-2పై కీలక ముందడుగు – కిషన్ రెడ్డి - మనోహర్ లాల్ ఖట్టర్ భేటీలో నిర్ణయాలు
కిషన్ రెడ్డి - మనోహర్ లాల్ ఖట్టర్ భేటీలో నిర్ణయాలు

Key Breakthrough on Metro Phase-2: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పారిశుద్ధ్యం వంటి ముఖ్యమైన అంశాలపై కీలక చర్చ జరిగింది. మెట్రో రెండో దశ డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
కేంద్రం, రాష్ట్రం చెరో 50 శాతం ఖర్చు భరించి ముందుకు సాగాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేరకు మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, వాటిని కేంద్రం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ హామీ ఇచ్చారు.
మూసీ నది పారిశుద్ధ్యం విషయంలో కూడా ముఖ్యమైన ప్రకటన చేశారు. అమృత్ 2.0 పథకం కింద మూసీలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేయడానికి మొత్తం 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను (STPలు) మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.3,975 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ 39 ఎస్‌టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుందని వెల్లడించారు.
నగరంలో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వ్యవస్థల అభివృద్ధిపై చర్చించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజల తరపున ఖట్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ అభివృద్ధి ప్రాజెక్టులు హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

