Telangana Cabinet Decisions: ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన 38వ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్‌ 19న సిద్దిపేటలో ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ రోజు నుంచి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమవుతుంది. అదే రోజున ఇందిరమ్మ చీరల రెండో విడత పంపిణీని కూడా ప్రారంభిస్తారు. ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరిస్తాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) మరమ్మతులపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించింది. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. ఫౌండేషన్‌ లోపాలు, కటాఫ్‌ వాల్స్‌, స్పిల్‌వే వెడల్పు సమస్యలపై సాంకేతిక నివేదిక వచ్చింది. పారదర్శకంగా, వేగంగా మరమ్మతులు చేసి బ్యారేజీలను ఉపయోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ-ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు విడివిడిగా కమిషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ప్రతి కమిషన్‌కు ఒక చైర్మన్‌, ఐదుగురు సభ్యులు ఉంటారు. దీనికోసం సంబంధిత చట్టాన్ని సవరించనున్నారు.

డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్‌ సిటీలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌-2026’ నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వందలాది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరవుతారని మంత్రి చెప్పారు. రైజింగ్‌ తెలంగాణ కార్యక్రమాలు, సరళీకృత విధానాలతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయి. సీఎం నుంచి సర్పంచ్‌ వరకు అందరూ తమ పరిధిలోని ఒక ఇందిరమ్మ ఇంట్లో పాల్గొనాలి. నవంబర్‌ 7, 8, 9 తేదీల్లో సీఎం కొడంగల్‌లో పర్యటించి మెగా రైతు మేళా, పారిశ్రామిక ఎక్స్‌పో, రైతు బహిరంగ సభలో పాల్గొంటారు.

వివిధ శాఖల్లో కొత్తగా 1,199 పోస్టులను మంజూరు చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 886, ఫుడ్‌ సేఫ్టీలో 177, న్యాయ శాఖలో 136 పోస్టులు ఉన్నాయి. టీజీ సేఫ్‌ను బలోపేతం చేయడానికి కూడా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై సమగ్ర చర్చకోసం త్వరలో ప్రత్యేక శాసనసభా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎల్‌నినో ప్రభావం, ప్రభుత్వ చర్యలు, కేంద్ర సాయం, కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా అక్కడ చర్చించనున్నారు.

Next Story