Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అడ్డుకుందని చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

‘‘కేంద్రం అనుమతి లేకుండానే రేవంత్‌రెడ్డి ఆదరాబాదరాగా అమెరికా పర్యటన చేపట్టారు. అనుమతులు లేకుండా ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలపై కొత్త నిబంధనలు ఏవీ విధించలేదని, స్వాతంత్ర్యం నుంచి ఉన్న నిబంధనలే అమలు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇది సాధారణ ప్రక్రియ.. ఇందులో రాజకీయాలకు తావు లేదన్నారు.

న్యూయార్క్ మేయర్ మమ్దానీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారని వార్తలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. ‘‘పాక్‌కు అనుకూలంగా ఉంటూ భారత్‌పై విషం చిమ్మే వ్యక్తి మమ్దానీ. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని దూషించారు. న్యూయార్క్‌లో హిందువుల పండుగలపై ఆంక్షలు విధించారు. అలాంటి భారత వ్యతిరేకితో రేవంత్‌ ఎందుకు కలుస్తున్నారు? సీఎం స్థాయికి తగిన వారితోనే చర్చించాలి’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

గతంలో తన స్వంత విదేశీ పర్యటనను కూడా విదేశాంగ శాఖ నిరాకరించినట్లు గుర్తు చేశారు. 2005లో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అమెరికా పర్యటనను అడ్డుకుందని, కాంగ్రెస్ సీఎంల పర్యటనలను కూడా గతంలో రద్దు చేసిన సందర్భాలున్నాయని చెప్పారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తమకు ఇవ్వలేదని రేవంత్ వాదించడం వితండవాదమని పేర్కొన్నారు. అయితే హార్వర్డ్ బిజినెస్ కోర్సు చదవడానికి రేవంత్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

విదేశాంగ శాఖ దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటుందని, విదేశాల్లో సీఎంలు ఎవరిని కలుస్తారు, దేశానికి ఏం ప్రయోజనం అనేది పరిశీలిస్తుందని కిషన్‌రెడ్డి వివరించారు. సీఎం వెళ్లకుండానే అధికారులను పంపించి పెట్టుబడులు, ఒప్పందాలు సాధించవచ్చని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా కులగణన అంశంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, హైదరాబాద్‌లో 20 శాతం ఇళ్లలో కులగణన జరగలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కులగణనపై అవగాహన లేదని కూడా ఆయన ఎద్దేవా చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story