Kishan Reddy: డ్రగ్స్ సరఫరాదారులు ఎక్కడున్నా వదలం: కిషన్‌రెడ్డి హెచ్చరిక
కిషన్‌రెడ్డి హెచ్చరిక

Kishan Reddy: ఎవరైనా భారతదేశానికి డ్రగ్స్ సరఫరా చేస్తే వారు ఏడు సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి సికింద్రాబాద్‌లోని చిలకలగూడ చౌరస్తాలో ఉరివేస్తామని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్ తెచ్చినా, తయారు చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా ఈ దేశంలో భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. మాదకద్రవ్య రహిత దేశమే లక్ష్యంగా ఆయన మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ పాదయాత్ర అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద బుధవారం ప్రారంభమైంది.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ తదితరులు జెండా ఊపి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ‘సే నో టు డ్రగ్స్’ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మొదటి రోజు అంబర్‌పేట నుంచి ముషీరాబాద్ వరకు 11.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిగింది. అంబర్‌పేట, ఓయూ, సీతాఫల్మండి, చిలకలగూడ, ఒలిఫెంటా చౌరస్తా, గాంధీ ఆసుపత్రి ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. హాజరైన విద్యార్థులు, స్థానికులతో మత్తుపదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ వస్తున్నాయని, ఇది దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు, యువత జీవితాలను అంధకారం చేసేందుకు జరుగుతున్న కుట్ర అని పేర్కొన్నారు. అనేక దేశాలు భారత్‌ను సైనికపరంగా ఎదుర్కోలేక డ్రగ్స్‌తో యుద్ధం చేయాలనుకుంటున్నాయని , హైస్కూల్ పిల్లలకు చాక్లెట్ల రూపంలో, జూనియర్ కాలేజీల పిల్లలకు సిగరెట్ల రూపంలో, యువతకు ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ ఇస్తున్నారని వివరించారు. 2029లోగా దేశంలోని మత్తు మహమ్మారిని పూర్తిగా అరికట్టాలని, అందుకు సమాజమంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
సినీనటుడు వెంకటేశ్ మాట్లాడుతూ యువతను డ్రగ్స్ వంటి ప్రమాదకర వ్యసనాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ ఈ పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని, అందరం కలిసి కృషి చేస్తే నషా ముక్త్ భారత్ అసాధ్యం కాదని పేర్కొన్నారు.
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నిఖిల్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు పాల్గొన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద, సీతాఫల్మండిలో ప్రతిజ్ఞలు తీసుకున్నారు. ఈ పాదయాత్ర మూడు రోజులు కొనసాగి జూబ్లీహిల్స్‌లో ముగియనుంది. కిషన్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నవారితో కలిసి రాత్రి గడిపారు.

