Konda Surekha: ‘బిగ్ అప్‌డేట్’ వైరల్ పోస్టుపై కొండా సురేఖ క్లారిటీ.. అధికారిక ఖాతాలనే నమ్మాలని విజ్ఞప్తి
నమ్మాలని విజ్ఞప్తి

Konda Surekha: మంత్రి పదవి నుంచి తొలగింపు తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ పేరుతో ఫేస్‌బుక్‌లో వచ్చిన ‘బిగ్ అప్‌డేట్ కమింగ్ సూన్’ పోస్ట్ వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది. దీనిపై కొండా సురేఖ స్పందిస్తూ.. ఆ పోస్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలపగా, సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపారు. దీని ఆధారంగా గవర్నర్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. బర్తరఫ్ అనంతరం ఆమె భవిష్యత్తుపై ప్రశ్నలు వెల్లువెత్తుతుండగా, ఫేస్‌బుక్‌లో ‘‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. బిగ్ అప్‌డేట్ కమింగ్ సూన్. స్టే ట్యూన్ తెలంగాణ’’ అంటూ ఒక పోస్ట్ వచ్చింది. ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టించింది.
ఈ పోస్ట్‌పై స్పందిస్తూ కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘‘వివిధ సోషల్ మీడియా వేదికల్లో నా పేరుతో ప్రసారమవుతున్న పోస్టులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీడియా ప్రతినిధులు, ప్రజలు కేవలం అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.
బర్తరఫ్ తర్వాత మీడియాతో మాట్లాడిన సురేఖ కాంగ్రెస్ పార్టీని వీడనని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా పోస్ట్‌తో పార్టీలో కొనసాగుతారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కొండా కుటుంబం కూడా పార్టీలో కొనసాగడంపై సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. కేడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తీసుకునే తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

