Konda Surekha: కొండా సురేఖ: పార్టీలో నన్ను ఇబ్బందులకు గురి చేసే కుట్రలు
నన్ను ఇబ్బందులకు గురి చేసే కుట్రలు

భట్టి, మీనాక్షి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో మంత్రి కొండా సురేఖ సమావేశం
వివాదాలపై మీడియాతో మాట్లాడవద్దని ఏఐసీసీ ఇన్‌ఛార్జి సూచన
Konda Surekha: కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో తనను ఇబ్బంది పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కొండా సురేఖ పార్టీ ముఖ్య నాయకులతో చెప్పినట్లు సమాచారం. ఆమె ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌ను తొలగించిన విషయం, బుధవారం రాత్రి పోలీసులు ఆయన కోసం తన ఇంటికి వచ్చిన నేపథ్యంలో.. గురువారం మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరుకాలేదు. బదులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లను కలిశారు. సూర్యాపేట జిల్లాలో డక్కన్ సిమెంట్స్ కంపెనీని సుమంత్ బెదిరించినట్లు మరో మంత్రి ఉత్తమ్ సీఎంకు, మీనాక్షికి తెలిపారు. దీంతో సీఎం సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమంత్ కోసం పోలీసులు గాలించగా, ఆయన మంత్రి సురేఖ జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్లారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై ఆగ్రహించిన సురేఖ మంత్రివర్గ సమావేశానికి వెళ్లకుండా, కుమార్తె సుస్మితతో కలిసి ముందుగా భట్టి విక్రమార్కను కలిశారు.
తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సురేఖ సిద్ధమవుతుండగా, మీనాక్షి ఫోన్ చేసి అడ్డుకున్నారు. వివాదాల గురించి మీడియాతో మాట్లాడవద్దని, కలిసి చర్చిద్దామని సూచించారు. దీంతో సురేఖ కుమార్తెతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి మీనాక్షి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో భేటీ అయ్యారు. సుమంత్‌పై వచ్చిన ఆరోపణలు, అతడిని తొలగించడం, పోలీసులు తన ఇంటికి రావడం వంటి విషయాలను వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాలు, తనను, కుటుంబాన్ని, అనుచరులను ఇబ్బంది పెడుతున్న వారి గురించి ఫిర్యాదు చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కరిస్తామని హామీ: మంత్రి సురేఖ
మీనాక్షి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో సమావేశం తర్వాత సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఇబ్బందులు, ఆలోచనలు వారికి చెప్పాను. అందరూ చర్చించి సమన్వయం చేస్తామన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నా సమస్యను వారికి అప్పగించాను. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’ అని తెలిపారు.
రేవంత్‌రెడ్డి అంటే అభిమానం: కొండా మురళి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన సీఎం కావాలని తాను కోరుకున్నానని మంత్రి సురేఖ భర్త కొండా మురళి అన్నారు. వరంగల్‌లోని తన నివాసంలో గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన ఘటనల గురించి తనకు తెలియదని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి, నా మధ్య విరోధం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే సీఎంను నేరుగా కలిసి మాట్లాడతాను. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఆయన మాట నిలబెట్టుకుంటారని నమ్మకం ఉంది’ అని మురళి పేర్కొన్నారు.
హనుమకొండలో మంత్రి నివాసం వద్ద భద్రత తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇది అసత్యమని, భద్రతలో ఎలాంటి మార్పు లేదని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
టాస్క్‌ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహమే కారణం!
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయంలో పోలీసుల అత్యుత్సాహమే హైడ్రామాకు దారి తీసిందని తెలుస్తోంది. డక్కన్ సిమెంట్ కంపెనీని బెదిరించిన ఆరోపణలతో సుమంత్‌పై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బుధవారం ఉదయం నుంచి ఆయనను అనుసరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రాత్రి మంత్రి ఇంటికి వెళ్లడంతో అక్కడికి చేరుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంట్లోకి వెళ్లడం, మంత్రి కుమార్తె సుస్మితతో వాగ్వాదం జరగడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ పరిణామాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపినట్లు సమాచారం.
