TPCC Chief Mahesh Kumar Goud: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించిన తీరు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టంగా స్పందించారు.

సోమవారం మెదక్ హౌసింగ్ బోర్డులోని వినాయక్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా పీఏసీ సమావేశంలో మాట్లాడుతూ.. కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఏఐసీసీ, పీసీసీకి అందజేశామని, వివరణాత్మక నివేదిక వచ్చాకే ఏఐసీసీ పెద్దలు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

కాంగ్రెస్ పెద్ద పార్టీ కాబట్టి అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని మహేశ్ గౌడ్ అన్నారు. అయితే ఆ స్వేచ్ఛ హద్దులు దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. తనతో సహా అందరూ హద్దుల్లో ఉంటే మంచిదని సూచించారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నట్టే కాంగ్రెస్ కుటుంబంలో కూడా ఉంటాయని అన్నారు. కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, ఇది సీఎం మాట, తన మాట, మీనాక్షి నటరాజన్ మాట అని చెప్పారు. అయితే ఎవ్వరికీ 100 శాతం న్యాయం చేయలేమని, తాను వాస్తవాలు మాట్లాడతానని స్పష్టం చేశారు. 70 శాతం పదవులు పాత కాంగ్రెస్ నాయకులకే దక్కేలా అధిష్ఠానం హామీ ఇచ్చిందని, ములుగులో మంత్రి సీతక్క పాత నాయకులకే పదవులు ఇచ్చారని గుర్తు చేశారు.

సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. సోషల్ మీడియాపై కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారని, కత్తి దూసినవాడు కత్తికే చనిపోతాడన్నట్టు కేటీఆర్‌ను సోషల్ మీడియానే ఖతం చేస్తుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్‌ఎస్ చేసిన దోపిడీ, భూ దందా, అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణ సమయంలో ఎంతమందిపై కేసులు పెట్టి జైలుకు పంపారో ప్రజలు మర్చిపోలేదని అన్నారు.

ప్రధాని మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మెదక్ ఎంపీ రఘునందన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న ఉద్యోగాలు తీసేసిన ఘనత ప్రధాని మోదీదేనని విమర్శించారు. మోదీ హవా తగ్గిందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన ఇంటికి పోక తప్పదన్నారు. ప్రజలు 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో ప్రజాస్వామ్యం తక్కువని, దళితుడు రాజయ్యను డిప్యూటీ సీఎంగా ఉంచి రాత్రికి రాత్రే తొలగించారని, ఈటల రాజేందర్‌ను మెడపట్టి గెంటేశారని తీవ్రంగా విమర్శించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story