Konda Surekha: కొండా సురేఖ ఆవేదన: ‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెందుకు శిక్షిస్తారు? వివరణ కూడా తీసుకోలేదు’
వివరణ కూడా తీసుకోలేదు’

Konda Surekha: తెలంగాణ మంత్రివర్గం నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని, ఎలాంటి వివరణ అవకాశం కూడా ఇవ్వకుండా శిక్షించారని ఆమె ఆరోపించారు.
‘‘ఉరిశిక్ష పడిన వ్యక్తికి కూడా చివరిసారి ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తారు. నాకు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారు. ఈ నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సింది. రాజీనామా చేయమంటే చేసేదాన్నే. నిజంగా నేను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా బాగుండేది’’ అని సురేఖ అన్నారు.
తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ‘‘నా కుమార్తె స్వతంత్ర మహిళ. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకు నేను బాధ్యురాలిని కాదు. ఆమె వ్యాఖ్యలను నేను ఖండించాల్సిన అవసరం లేదు. ఆమె అభిప్రాయంతో నాకేం సంబంధం?’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేస్తున్నట్లు సురేఖ తెలిపారు. అలాగే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఏం చర్యలు తీసుకుందని కూడా ప్రశ్నించారు. తనను బర్తరఫ్ చేసిన నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

