KTR Slams Congress: కేటీఆర్ మండిపాటు – కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం
కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం

KTR Slams Congress: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసిందని, వారి గొంతుకోసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కారు ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కష్టపడి, తల్లిదండ్రుల కష్టార్జిత డబ్బును ఖర్చు చేసి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. అసమర్థత, అవినీతి కారణంగా ఈ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని, ఉద్యోగాలను అమ్ముకుని నిరుద్యోగుల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు.
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్యాన్ని యువత ఎన్నటికీ క్షమించదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 పరీక్షను తాజాగా మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, అసలు దోషులను గుర్తించాలని కోరారు.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానం మోసపూరితమని, ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్ సూచించారు.
