Minister Ponguleti: కేటీఆర్ హద్దు దాటితే ప్రజాగ్రహం తప్పదు: మంత్రి పొంగులేటి హెచ్చరిక
మంత్రి పొంగులేటి హెచ్చరిక

Minister Ponguleti: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు బీఆర్‌ఎస్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“రైతే రాజుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నది. మా ప్రభుత్వం రాగానే వరికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. వరి సాగులో దేశంలోనే ప్రథమ స్థానం సాధించాం. వెయ్యి రోజుల్లో రైతులకు రూ.1.76 లక్షల కోట్లు అందించాం” అని పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించి గ్రూప్-1 ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారని, తమ ప్రభుత్వం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఇటీవలే 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలు, అప్పులు చెల్లిస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు, దాదాపు 3 లక్షల మంది వితంతువులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వనున్నామని తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, పదేళ్లపాటు పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సర్పంచుల బకాయిలు తామే చెల్లించామని స్పష్టం చేశారు. “మీ 3,475 రోజుల పాలన కంటే మా వెయ్యి రోజుల పాలనే బాగుందని ప్రజలు చెబుతున్నారు” అని పొంగులేటి అన్నారు.
కేటీఆర్ రాహుల్ గాంధీని ఉద్దేశించి సంస్కారహీనంగా మాట్లాడారని, హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. బతుకమ్మ చీరల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని, ఉప ఎన్నికలు, లోక్‌సభ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడినా బీఆర్‌ఎస్‌కు జ్ఞానోదయం కాలేదని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 22ఏ భూములపై అసెంబ్లీలో చర్చిద్దామని, బీఆర్‌ఎస్ నేతలు ఏం మాట్లాడతారో మాట్లాడాలని సవాల్ చేశారు. 22ఏని అడ్డుపెట్టుకుని దందాలు చేయడం కుదరదని హెచ్చరించారు.
పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, మేనిఫెస్టో హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిపక్ష పాత్రను విస్మరించాయని, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు అనర్హులని విమర్శించారు. ధరణి ద్వారా కొల్లగొట్టిన భూములపై విచారణ జరుగుతోందని, కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
ప్రజా పాలనలో సామాన్యుల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.

