CM Revanth Reddy: ఏప్రిల్ నుంచి పేదలకు లక్షలాది ఇళ్లు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయండి - సీఎం రేవంత్‌రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయండి - సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని గుర్తించి, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ’ సభలో ఆయన ప్రసంగించారు.
గతంలో రేషన్ కార్డుల కోసం పదేళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. సన్న బియ్యం పొందినవారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందున్నదని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు లేదని, విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ బీఫార్మ్‌పై పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులకు కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశామని, రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నామని వివరించారు. రైతు భరోసా పథకం కింద రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లు ఇచ్చామని, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో అత్యధికంగా రైతుల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని చెప్పారు. ఏప్రిల్‌లో కొత్త బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లు పేదలకు కేటాయిస్తామని, పేదల ఆత్మగౌరవాన్ని పెంచే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు.
నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కనపెట్టారని, అది ఆగిపోతే మామ-అల్లుళ్లు దావతు చేసుకున్నారని విమర్శించారు. నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగడానికి బీఆర్‌ఎస్ కారణమని మండిపడ్డారు. రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టామని తెలిపారు. కేసీఆర్‌కు పోలీసులు నోటీసు ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.

