Jagruthi : బీసీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
బీసీ రిజర్వేషన్ల సాధనకోసం 72 గంటల దీక్షకు దిగిన ఎమ్మెల్సీ కవిత

బీసీ రిజర్వేషన్లు చట్టబద్దం అయ్యాకే స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కవిత ఇందిరాపార్క్ వద్ద సోమవారం నుంచి 72 గంటల నిరాహార దీక్షకు పూనుకున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలు సంతకం పెట్టకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకూ 72 గంటల దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. నాది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవ పోరాటమని కవిత అన్నారు. అహింసా మార్గంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని కవిత ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని బూచిగా చూపించి బీసీలను మోసం చేయవద్దని ఆమె అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ముస్లీంలకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చెప్పినట్లు అమలు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధనకోసం బీసీలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ధర్నా చౌక్ ఓపెన్ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారని, కానీ నాకు 72 గంటల దీక్షకు అనుమతివ్వడానికి ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు. సబ్బండవర్ణాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామని, తెచ్చకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారం రావాలని కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారని, సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారని కవిత తెలిపారు.
