ఏపీకి మాధవ్… తెలంగాణకు రామచంద్రరావు
రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఖరారు

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శాఖల అధ్యక్షులు ఖరారయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవి కోసం సోమవారం నామినేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడానికి ముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనే విషయంపై అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గడచిన ఆరు నెలులుగా అనేక మంది నాయకుల పేర్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తెరమీదకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్లు ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో ప్రముఖంగా వినిపించాయి. వీరిద్దరే కాక యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిలు కూడా అధ్యక్ష రేసులో తాము కూడా ఉన్నట్లు ప్రచారం చేసుకున్నారు. అసలు వీరంతా కాదు బీసీకే ఈ సారి అభ్యర్ధిగా ఉంటారు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక తననే కొనసాగించమని ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అధిష్టానాన్ని కోరారు. అయితే బీజేపీ ఢిల్లీ నాయకత్వం మాత్రం మాజీ ఎమ్మెల్సీ మాధవ్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా దాదాపు మాధవ్ పేరు ఖారారైనట్లే.
ఇక తెలంగాణ విషయానికి వస్తే 2028లో ఒంటరిగా ఈ రాష్ట్రంలో అధికారం రావాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. ఈ సారి సర్వజన ఆమోదం ఉండటంతో పాటు పార్టీని ఉరుకులు పెట్టించే నాయకుడ్ని అధ్యక్షుడిగా ఎపింక చేయాలని అధిష్టానం భావించింది. ఈ కోవలో బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన అపార రాజకీయ అనుభవం ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పేరు తెరపైకి వచ్చింది. గడచిన ఆరు నెలలుగా ఈటల పేరు రేపు ప్రకటిస్తారు, ఎల్లుండి ప్రకటిస్తారని లీకులు కూడా ఇచ్చారు. ఒక దశలో అసలు ఈటలకు పోటీనే లేదన్న విధంగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణలో సీనియర్ బీజేపీ నాయకులు ఈటల అభ్యర్ధత్వాన్ని అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా జరగింది. ఈటలకు ఆల్టర్నేటివ్ గా ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఆ స్ధాయిలో ఈ ఇద్దరు నేతలు అధిష్టానం వద్ద లాబీయింగ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుత అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఇద్దరి ప్రయత్నాలకు మద్దతు తెలుపకపోయినా ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల సుముఖతగా ఉన్నట్లు ఎక్కడా బయపడలేదు. తెరవెనుక ఆయన చేయగలిగిన రాజకీయం ఆయన చేస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ అధికంగా ఉండటంతో కేంద్ర నాయకత్వం ఎన్నికలు నిర్వహించాలని భావించి సోమవారం నామినేషన్ల ధాఖలుకు తేదీ ఖారు చేశారు. ఓ పక్క నామినేషన్ల ప్రక్రియ మరికొద్ది సేపట్లో మొదలు కానుండగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావుని కూడా నామినేషన్ వేయమని కేంద్ర నాయకత్వం నుంచి ఫోన్లు వచ్చినట్లు చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా దాదాపు ఎన్.రామచంద్రరావు పేరు ఖరారు అయినట్లు తెలంగాణ బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
