Rythu Aashirvada Sabha: ఖమ్మం జిల్లా మధిరలో రేపు (మంగళవారం) జరగాల్సిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. సభా ప్రాంగణంలో వరద నీరు చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చారు.

మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ సభ జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు లక్ష మంది రైతులతో సభ నిర్వహించాలని భారీ ఏర్పాట్లు చేశారు.

అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. సభ నిర్వహించడం అసాధ్యమని జిల్లా అధికారులు సీఎంవో కార్యాలయానికి తెలియజేయడంతో ప్రభుత్వం సభను రద్దు చేసి హైదరాబాద్ శిల్పకళా వేదికకు మార్చింది. రేపు సాయంత్రం ఇక్కడే రైతుభరోసా పంపిణీ సదస్సు నిర్వహించి, నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు హైదరాబాద్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం ప్రభావం వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం త్వరిత చర్యలు తీసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story