Mahesh Goud: బీఆర్ఎస్‌కు మహేశ్ గౌడ్ సవాల్.. తలసానికి ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలి
పదవి ఇవ్వాలి

Mahesh Goud: వినాయక చవితి పండగ రోజున గాంధీభవన్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పండగ రోజు రాజకీయాలు మాట్లాడాలని తాను కోరుకోనప్పటికీ, ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం వల్ల తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
కేసీఆర్ రాజకీయ పాలసీలను, బీఆర్ఎస్ ఆలోచనలను శుద్ధి చేయాలని మహేశ్ గౌడ్ సూచించారు. బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నేతగా నియమించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ సెప్టెంబర్ 16న అసెంబ్లీ సమావేశాలకు రావాలని డిమాండ్ చేస్తూ, ఆయన వస్తే బీఆర్ఎస్ నేతలపై ఉన్న సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపారు.
స్పీకర్‌ను కులం పేరుతో దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు పార్టీ వైఖరికి నిదర్శనమని మహేశ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నరనరాల్లో దళిత వ్యతిరేకత ఉందని ఆయన ఆరోపించారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ దళిత కార్డు వాడినా, దళిత కవులు, కళాకారులను అవమానపరిచారని, కేసీఆర్ హయాంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగాయని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారని, అంబేద్కర్ విగ్రహాలు పెట్టినంత మాత్రానా వారసులు కాలేరని స్పష్టం చేశారు. “దళితులు నడిచిన రోడ్డును శుద్ధి చేయడమేంటి? దళితులపై బీఆర్ఎస్ నేతలకు ఇంత అక్కసు ఉందా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విషయంలో ఆమె విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారని, కొత్త ఇన్‌ఛార్జ్‌ను ఏఐసీసీ నిర్ణయిస్తుందని మహేశ్ గౌడ్ తెలిపారు. కొండా సురేఖను అధిష్ఠానం పిలిచిందన్న వార్తలపై తనకు సమాచారం లేదని పేర్కొన్నారు.

