Dharani Irregularities: తెలంగాణ సీఐడీ ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై కీలక ఆపరేషన్‌ చేపట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 సీఐడీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, భువనగిరి, గజ్వేల్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో పలువురు ధరణి ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం నలుగురిని అరెస్టు చేశారు.

సాగుభూముల లావాదేవీల పోర్టల్‌ ధరణిలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చే క్రమంలోనే సీఐడీ ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ధరణి అక్రమాలపై కొన్ని రోజులుగా ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీ (సెట్‌) విచారణ జరుపుతోంది. ఆ కమిటీ పరిశీలనలో తేలిన అంశాల ఆధారంగానే సీఐడీ తాజా కేసు నమోదు చేసి ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆపరేషన్‌ వివరాలపై సీఐడీ ఉన్నతాధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చు.

సెట్‌ విచారణ నేపథ్యంలోనే ఈ కీలక పరిణామం జరిగింది. ధరణిలో అక్రమాలపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ఇటీవలే సెట్‌ను ఏర్పాటు చేసింది. సీఐడీ డీజీ చారు సిన్హా నేతృత్వంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన ఏడుగురి కమిటీ కొన్ని రోజులుగా విస్తృత విచారణ జరిపింది. రెవెన్యూ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ను నిర్వహించే ఆపరేటర్లు, అనధికారిక వ్యక్తులకు ఈ అక్రమాల్లో ప్రమేయం ఉందని ఫోరెన్సిక్‌ విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ధరణి పోర్టల్‌ ఆపరేటర్లు కీలకంగా వ్యవహరించడం వల్లే ఈ దందా సాగిందని నిర్ధారణకు వచ్చారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి తదితర జిల్లాల్లో అనధికారికంగా పోర్టల్‌లోకి చొరబడి విలువైన భూముల యాజమాన్య హక్కులు మార్చారనే ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో విలువైన భూముల కేసులు న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యంతర ఆదేశాలను ఆసరాగా చేసుకుని యాజమాన్య హక్కులు మార్పిడి చేసినట్లు, కొన్ని భూపార్సిళ్లకు సంబంధం లేని తీర్పులను అన్వయించి హక్కులు కొట్టేశారన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. భూదాన్‌ భూములకు బైనామీలతో హక్కులు మార్చారనే ఫిర్యాదులపైనా విచారణ జరిగింది.

ఎక్కడ, ఎవరు, ఏ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యారు, ఎలాంటి మార్పులు చేశారనే అంశాలపై డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌ను ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ తాజా ఆపరేషన్‌ నిర్వహించినట్లు సమాచారం.

Next Story