Agricultural Tractor Registrations: తెలంగాణలో వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌పై రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు పట్టుబట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాల వారీగా భూమి విస్తీర్ణం లెక్కలు మారుతుండటం విశేషం.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు ట్రాక్టర్ కొని రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా, రవాణా అధికారులు పట్టా పాస్‌బుక్ అడిగారు. తన పేరిట ఉన్న రెండెకరాల పట్టా పాస్‌బుక్ చూపించినా, కనీసం మూడెకరాలు ఉండాలని చెప్పి తిరస్కరించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో రైతు ఒక ఎకరం భూమి పట్టా చూపించినా రిజిస్ట్రేషన్ చేశారు. కొన్ని జిల్లాల్లో అయితే ఐదు ఎకరాల భూమి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్‌కు కచ్చితంగా ఎంత భూమి ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు. 2014లో విడుదలైన జీవోలో ట్రాక్టర్‌ను రైతు యాజమాన్యం లేదా అధీనంలోని భూమి నుంచి 24 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ అవసరాలకు మాత్రమే వాడాలని ఉంది. భూమి విస్తీర్ణం గురించి ప్రస్తావన లేదు. వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు కూడా అమలులో ఉంది. ప్రభుత్వ యాంత్రీకరణ పథకం కింద 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది.

అయితే కొందరు వ్యవసాయం కోసమని చెప్పి వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని అధికారులు విచక్షణతో జిల్లా పరిస్థితులు, భూ విలువలు బట్టి భూమి విస్తీర్ణం చూపించాలని కోరుతున్నారు. దీంతో రైతులు ఏజెంట్ల వద్దకు వెళ్లి అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోంది. కొన్ని ఆర్టీవో కార్యాలయాల్లో సిబ్బంది ట్రాక్టర్, ట్రాలీలను కమర్షియల్‌గా మారుస్తామని సతాయించి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరం. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా కౌలు రైతులు ఉండగా, వారు తప్పనిసరిగా వాణిజ్య విభాగంలోనే ట్రాక్టర్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ విషయంపై అదనపు రవాణా కమిషనర్ రమేశ్ మాట్లాడుతూ.. “వ్యవసాయ విభాగంలో ట్రాక్టర్ కొనాలంటే ఎంతో కొంత భూమి రైతు పేరిట చూపించాలి. భూమి లేకపోతే రైతుగా ఎలా గుర్తించగలం. ఆయా జిల్లాల పరిస్థితులను బట్టి 3 లేదా 4 ఎకరాలు చూపించాలని అధికారులు నిర్దేశించుకున్నారు. లేకపోతే భూమి లేనివారు, సాగు చేయనివారు కూడా ట్రాక్టర్లు పొంది ఇతర అవసరాలకు వాడుతున్నారు” అని వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story