CM Revanth Reddy: కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా జీవిత లక్ష్యం: సీఎం రేవంత్
సీఎం రేవంత్

CM Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నదే తన జీవిత లక్ష్యమని, ప్రజాబలంతో రాష్ట్రంలో సునామీ సృష్టిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం, సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో రైతు మేళా, మహిళా సంఘాల సమావేశం, రైతన్నతో ఆత్మీయ సభల్లో ఆయన మాట్లాడారు. అభిమానుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకొన్నారు.
మహిళల సాధికారతపై దృష్టి
‘‘కోటి మంది మహిళలను 2034 నాటికి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చాలి. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరురాలు కావాలన్నదే నా జీవిత లక్ష్యం. అలా చేస్తే నా జన్మ ధన్యమైనట్లే’’ అని సీఎం అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు స్వయం సహాయక సంఘాల్లో 60 లక్షల్లోపే సభ్యులు ఉండగా, మూడేళ్లలో ఏడున్నర లక్షల మంది కొత్తగా చేరారని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని, వడ్డీగా రూ.19 వేల కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా నిత్యం 37 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఒక ఇంట్లో నెలకు సుమారు రూ.8 వేలు ఆదా అవుతుందని వివరించారు. నవంబర్ 19న ఇందిరమ్మ జన్మదినం రోజున కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శ
కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షల కోట్లకు పైగా చెల్లించామని సీఎం ఆరోపించారు. ‘‘కేసీఆర్ సీఎం అయ్యే నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్లు అప్పు పెట్టి ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ఏటా రూ.80 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లిస్తున్నాం’’ అని అన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటానని కేటీఆర్ అంటున్నారని, కొడంగల్‌కు నీళ్లు వస్తే వారికి కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు.
2028లోగా కొడంగల్‌కు కృష్ణా జలాలు
‘‘2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తా. ఎవరు అడ్డొచ్చినా వెనక్కు తగ్గం. ఇది పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన’’ అని సీఎం హామీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ కార్యక్రమం కొడంగల్ నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ సునామీ సృష్టిస్తానని, అందులో మోదీ అయినా ఎవరైనా కొట్టుకుపోవాల్సిందేనని హెచ్చరించారు. కొడంగల్ అండగా ఉంటే ఢిల్లీనైనా ఎదిరిస్తానని సవాలు విసిరారు.

