TBJP PRESIDENT : తెలంగాణ బీజేపీ నూతన రధసారథి ముందు అనేక సవాళ్ళు
టీబీజేపీ అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టిని ఎన్.రామచంద్రరావు

- పార్టీని అధికారం దిశగా తీసుకెళ్ళేలా పోరాటాలు చేయాలంటున్న కార్యకర్తలు
- కొత్తా, పాతలను కలపుకుని ముందుకెళ్ళాల్సిన బాధ్యత రామచంద్రరావుదే
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నేటి శనివారం బాధ్యతలు చేపట్టిన నారపరాజు రామచంద్రరావుకి పార్టీలో అనేక సవాళ్ళు స్వాగతం పలుకుతున్నాయి. అనేక మంది నిరసనల మధ్య ఎన్.రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయన ఎన్నికయ్యీ అవడంతోనే గోషామహల్ శాసనసభ్యుడు పార్టీకి రాజీనామాతో నూతన అధ్యక్షుడికి తొలి సమస్య ఎదురయ్యింది. రాజాసింగ్ వ్యవహారం ఎంత పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పినా ఆయన్ను బుజ్జగించి సమస్య పరిష్కరించాల్సి బాధ్యత తెలంగాణ బీజేపీ నాయకత్వంపైనే ఉంటుంది. ఇప్పుడు టీబీజేపీ నూతన సారధి ముందు ఉన్న అతి పెద్ద టాస్క్ ఇదే. రామచంద్రరావు ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఎంత వరకూ కన్విన్స్ చేయగలుగుతారు… ఆయన చేత రాజనామా ఉపసంహరింప చేయించగలుగుతారా అన్న ప్రశ్న బీజేపీ శ్రేణులను వేధిస్తోంది. విచిత్రం ఏంటంటే అధిక శాతం కషాయ కార్యకర్తలు రాజాసింగ్ పార్టీకి దూరమవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన అధ్యక్షుడు ఎలాగైనా రాజాసింగ్‌ని బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కషాయ దళం కోరుకుంటోంది. ఇది ఒక రకంగా రామచంద్రరావుకు ఛాలెంజింగ్ టాస్కే.
ఇక రామచంద్రరావు ముందు ఉన్న మరో ప్రధానమైన ఛాలెంజ్ తెలంగాణ బీజేపీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం. కొత్తా, పాత నాయకులనే బేధభావం లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి. ఇప్పటికే పార్టీలో తొలి నుంచి ఉన్న బీజేపీ నాయకులు మమ్మల్ని ఎదగనివ్వడం లేదనే భావన పార్టీలోకి ఈ మధ్య కాలంలో వచ్చి చేరిన నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొత్త వచ్చిన వారికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయం వారిలో ఉంది. ఇదే సమయంలో గత పదేళ్ళ కాలంలో పార్టీలో చేరి ప్రజాప్రతినిధులు అయిపోయిన ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డీకేఅరుణ, రఘునందనరావు, మహేశ్వరరెడ్డి, రాకేష్ రెడ్డి, పాయలశంకర్ వంటి నేతలు ఇండివిడ్యువాలిటీతో రాజకీయం నెరపుతున్నారు. వీరందరి మద్దతు సైతం కూడగట్టుకుని పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధ్యక్షుడు రామచంద్రరావుపై ఉంది. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక సారి ఎమ్మెల్సీగా ఎన్నికవవ్వడం తప్ప… ఎలక్టరోల్ పాలిటిక్స్ లో ఒక్కసారైనా ప్రజల నుంచి ఎన్నిక కాని వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించడమేంటనే అభిప్రాయం వీరందరిలో ఉంది. ఈవిషయాన్ని వారు తమ సన్నిహితుల వద్ద బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అరవింద్, డీకేఅరుణ లాంటి వారికి తనపై ఉన్న అభిప్రాయాన్ని పారదోలి వారు తనతో పనిచేసే విధంగా చేసుకోవడం రామచంద్రరావు ముందు ఉన్న అతిపెద్ద సవాల్. అలాగే ఇటువంటి నాయకులకు పార్టీలో సీనియర్లకు మధ్య ఉన్న అంతరాలను నివారించే బాధ్యత కూడా రామచంద్రరావుపై ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే కసి ప్రతి బీజేపీ కార్యకర్తలోనూ ఉంది. ఇదే భావన నాయకులందరిలోనూ రగిల్చి పార్టీని 2028 అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన గురుతర బాధ్యత రామచంద్రరావుపై ఉంది. ఇప్పుడున్న పట్టు సడలకండా ఇంకా తీవ్ర స్ధాయిలో పార్టీ శ్రేణుల్లో అధికారం దక్కించుకోవలనే కాంక్షను పెంపొందిచే కార్యచరణను రామచంద్రరావు రూపొందిస్తారని బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో పార్టీని క్షేత్ర స్ధాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు కొత్త రక్తాన్ని పార్టీలో చేర్చుకోవడం వంటి కార్యక్రమాలకు రామచంద్రరావు శ్రీకారం చుడతారని కషాయ దళం గంపెడాశతో ఉంది. ఇక రాజకీయంగా చూస్తే తెలంగాణలో బీజేపీ అటు కాంగ్రెస్… ఇటు బీఆర్‌ఎస్ పార్టీలతో పోరాడి ఎదగాలి. రామచంద్రరావు స్వతహగా సౌమ్యుడు. ఈ రెండు ప్రత్యర్ధి పార్టీల పట్ల ఎంతవరకూ కఠినంగా వ్యవహరించి రాజకీయ పోరాటాలు చేస్తారో అనే అనుమానం కార్యకర్తల్లో ఉంది. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో కానీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీని కానీ తమలపాకుతో కొడితే కుదరదని, రెండు పార్టీలుపై విరుచుకు పడాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా పోరాటాల దిశగా పార్టీ పనిచేసిందే లేదని, అదే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారని అదే తరహాలో రామంచంద్రరావు కూడా కార్యక్రమాలు రూపొందించాలని బీజేపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రామచంద్రరావు సైతం తాను సౌమ్యుడినేనని కానీ యుద్దంలో దిగితే యోధుడినని అన్న మాటలు పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. అయితే ఆచరణలో కూడా అదే విధంగా ఉండి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చి దశాబ్ధాలుగా ఇక్కడి పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్న కలలను నిజంయ చేయాలని తెలంగాణ బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నారు.
