వారంతా దక్షిణ బస్తర్‌లోనే..?

Maoists: మావోయిస్టు పార్టీ రోజురోజుకూ బలహీనమవుతోంది. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఆ పార్టీ ఉనికి పరిమితమైపోతోంది. ఒకప్పుడు దండకారణ్యంలో సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు ఇప్పుడు ప్రాణాలు దక్కితే చాలు అన్న పరిస్థితికి చేరుకున్నారు. పార్టీలో రెండో స్థానంలో ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు, దాడుల వ్యూహకర్త ఆశన్న లొంగుబాటుతో పార్టీకి భారీ నష్టం జరిగింది. వారిద్దరూ 280 మంది కేడర్‌ను తమతో తీసుకువచ్చారు. దీంతో దండకారణ్యంలోని కొన్ని ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలోని కేడర్‌ మల్లోజులతో, ఉత్తర బస్తర్‌లోని కేడర్‌ ఆశన్నతో వెళ్లిపోయింది. ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి దక్షిణ బస్తర్‌కే పరిమితమైంది. బస్తర్‌ జిల్లా కేంద్రం జగదల్‌పుర్‌కు దక్షిణాన బాకావండ్, లోహండిగూడ, తోకపాల్, దర్భ, సుక్మా, బీజాపుర్‌ అడవుల్లో వారు తలదాచుకున్నట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలను స్థావరంగా చేసుకున్నారని భావిస్తూ కేంద్ర బలగాలు అటువైపు దృష్టి సారించాయి. ‘అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్‌ ఇప్పుడు మావోయిస్టులు లేని ప్రాంతాలు. దక్షిణ బస్తర్‌లో మాత్రమే వారి ఉనికి ఉంది. త్వరలో అక్కడా సమూలంగా తుడిచిపెట్టేస్తాం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించారు.

హిడ్మా నేతృత్వంలో అగ్రనేతలు

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఎలియాస్‌ గణపతి మాత్రమే మిగిలారు. కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్‌బెస్రా ఎలియాస్‌ సునిర్‌మాల్‌ ఝార్ఖండ్‌ గిరిధ్‌ ప్రాంతానికి పరిమితమయ్యారు. పీఎల్‌జీఏ కార్యకలాపాల్లో నిపుణుడైన మడావి హిడ్మా నేతృత్వంలో దేవ్‌జీ, గణపతి లాంటి అగ్రనేతలు దక్షిణ బస్తర్‌లో ఆశ్రయం పొందుతున్నారని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

తెలంగాణ కమిటీకి మార్గనిర్దేశం చేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు ఎలియాస్‌ చంద్రన్న, తెలంగాణ కమిటీ సభ్యులు బడే దామోదర్‌ ఎలియాస్‌ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య ఎలియాస్‌ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఎలియాస్‌ వెంకటేశ్‌ తదితరులు తమ కేడర్‌తో అక్కడే ఉన్నట్లు అంచనా.

హిడ్మా నేతృత్వంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌తోపాటు తెలంగాణ కమిటీకి చెందిన 60 మంది సహా మొత్తం 500 మంది సాయుధులు దక్షిణ బస్తర్‌లో ఉన్నారని నిఘావర్గాలు తెలిపాయి.

Updated On 20 Oct 2025 8:13 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story