జనసంద్రంతో నిండిపోయిన వనదేవతల కొలువు

Sammakka-Saralamma Maha Jatara: సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో ప్రధాన ఘట్టం పూర్తయింది. గురువారం చిలకలగుట్టపై కుంకుమ భరిణె రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని ఆదివాసీ పూజారులు పవిత్ర గద్దెపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అమ్మవారి ఆగమనంతో మేడారం నిండు జాతర కళలతో మెరిసిపోయింది. భక్తుల జయజయధ్వానాల మధ్య జనసంద్రంగా మారిన మేడారం ఇప్పుడు వరాల తల్లి సాన్నిధ్యంతో పవిత్ర వాతావరణంలో మునిగిపోయింది.

తెల్లవారుజాము నుంచే సమ్మక్క ఆగమన ప్రక్రియ మొదలైంది. ముందుగా పూజారుల కుటుంబాల మహిళలు గద్దెను అలంకరించారు. మేడారం పడమర దిక్కులోని జెండా గుట్ట నుంచి పచ్చి వెదురుకర్ర రూపంలో ఉన్న వనదేవతను తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాన పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, మునీందర్, వడ్డెలు కొక్కెర కృష్ణయ్య బృందం చిలకలగుట్టకు చేరుకుని అమ్మవారిని అలంకరించి సంప్రదాయ పూజలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో కుంకుమ భరిణెను గద్దెపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు.

చిలకలగుట్ట నుంచి గద్దె వరకు దారంతా భక్తులతో కిటకిటలాడింది. ‘తల్లీ సమ్మక్క... సల్లంగ చూడమ్మ’ అంటూ జయజయధ్వానాలు మోగాయి. మహిళలు అందమైన ముగ్గులు వేసి అమ్మకు ఘన స్వాగతం పలికారు. దారంతా రంగవల్లులతో అలంకరించారు. వందలాది మంది భక్తులు డోలు, డప్పు చప్పుళ్లకు లయబద్ధంగా నృత్యాలాడారు. ఆదివాసీ సంప్రదాయ కొమ్ముబూర సంగీతంతో కళాకారులు భక్తి పారవశ్యాన్ని నింపారు.

సమ్మక్కను తీసుకొస్తుండగా ఏకే-47 కాల్పులతో గౌరవ వందనం చేశారు ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తదితరులు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్, కలెక్టర్ దివాకర్ తదితరులు హాజరై అమ్మవారికి స్వాగతం పలికారు. చిలకలగుట్ట దిగుతుండగా, గేటు వద్ద కూడా కాల్పులతో హోరెత్తించారు.

జాతర జనసంద్రంగా మారడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది ఐపీఎస్ అధికారులు రద్దీ నియంత్రణలో పాల్గొన్నారు. తల్లుల దర్శనానికి క్యూలైన్లలో కనీసం రెండు గంటలు పట్టింది. జంపన్నవాగు ఒడ్డున లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. మేడారం మొత్తం గుడారాల మయమైంది.

నేడు గవర్నర్ దర్శనం

శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారంలో తల్లులను దర్శించుకోనున్నారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచే ప్రముఖుల సందడి మొదలైంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు తల్లులను దర్శించుకొని ఎత్తుబంగారం సమర్పించుకున్నారు.

ఈ మహా జాతర తెలంగాణ సంస్కృతి, ఆదివాసీ భక్తి సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతోంది. భక్తులు అమ్మవారి ఆశీస్సులతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Updated On 30 Jan 2026 4:18 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story