Messi’s Hyderabad Visit: మెస్సీ హైదరాబాద్ పర్యటన… ఉప్పల్‌లో సాయంత్రం ఫుట్‌బాల్ ప్రదర్శన
ఉప్పల్‌లో సాయంత్రం ఫుట్‌బాల్ ప్రదర్శన

Messi’s Hyderabad Visit: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి శనివారం సాయంత్రం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా-2025’లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న మెస్సి.. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయం వద్ద అభిమానుల సందడి నెలకొంది. అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన పరిమిత సంఖ్యలో (వందమంది) మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మెస్సి పర్యటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో అభిమానుల నిరసనలు, గందరగోళం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు మెస్సి బృందం ఉప్పల్ స్టేడియానికి చేరుకోనుంది. రాత్రి 7.50 గంటలకు ‘గోట్ ఫుట్‌బాల్’ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
మ్యాచ్ షెడ్యూల్ వివరాలు:
రాత్రి 8.06 గంటలకు: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మెస్సి మైదానంలోకి ప్రవేశం
రాత్రి 8.08 గంటలకు: రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ మైదానంలోకి
రాత్రి 8.13 గంటలకు: పెనాల్టీ షూటౌట్
రాత్రి 8.18 గంటలకు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మైదానంలోకి ప్రవేశం
ఈ కార్యక్రమంలో మెస్సి తో పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్లు పాల్గొననుండటంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. నగరంలో మెస్సీ మేనియా కొనసాగుతోంది.

