Minister Duddilla Sridhar Babu: జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ.. 2028 నాటికి పూర్తి, రెండు లక్షల ఉపాధి అవకాశాలు
ఉపాధి అవకాశాలు

Minister Duddilla Sridhar Babu: జహీరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీ పనులన్నీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. 3,245 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పారిశ్రామికవాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇది పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు.
సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌లు ఢిల్లీ నుంచి నిర్వహించిన ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్’ వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీధర్‌బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల శాఖ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉండగా, అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు సమకూరుస్తోంది. నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, విద్యుత్తు సరఫరా పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం ‘భవ్య’ పథకం కింద ప్రకటించిన 100 ‘ప్లగ్ అండ్ ప్లే’ పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని పీయూష్ గోయల్‌ను శ్రీధర్‌బాబు కోరారు.

