Minister Ponguleti: నాడు ధనదాహంతో నీటి ఒప్పందాలు: భారాస నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం
మంత్రి పొంగులేటి ధ్వజం

Minister Ponguleti: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు నాడు ధనదాహంతో నీటి ఒప్పందాలు చేసుకుని, నిర్ణయాలు తీసుకుని కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని ఆధారాలతో స్పష్టంగా చెప్పినా హరీశ్‌రావు తీరు మారట్లేదని, అసత్యాలు ముందు పుట్టి భారాస నేతలు తర్వాత పుట్టారని ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో మంగళవారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, భారాస నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేసి ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్‌రావు వెలగబెట్టింది ఏంటో సూటిగా చెప్పాలని సవాలు చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీల వాటాకే ఒప్పందం చేసుకుని రైతాంగాన్ని నట్టేట ముంచారని పొంగులేటి పేర్కొన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో మూడేళ్లుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ తప్ప ఎక్కడా పంట కాల్వలు తవ్వలేదని, 10, 20 లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.
రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టుల్లోని తుమ్మచెట్లు పీకేసి ఆ ప్రాజెక్టులన్నీ తామే కట్టామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. భూసేకరణకు భారాస ప్రభుత్వం కన్నా మేమే ఎక్కువ డబ్బు పరిహారంగా ఇచ్చామని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పడావున పడ్డ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మళ్లీ కదలిక వచ్చిందని తెలిపారు.
మా నిజాయతీ, చిత్తశుద్ధి ప్రజలకు తెలుసని, ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమం, నీటి హక్కుల పరిరక్షణపై దృష్టి పెట్టిందని, భారాస చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలను మోసగించలేవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించారు.

