బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు

Minister Seethakka: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నేతలు అనవసరంగా విమర్శిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. నాణ్యమైన, స్థానిక చేనేతల చేత నేసిన చీరలు పంపిణీ చేస్తున్నప్పటికీ, అవి 'బాగాలేవు' అని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కల్పించడం తగదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు, ఆడబిడ్డలు ఎంతగానో సంతోషిస్తున్నారని, అందుకు ఈ స్థాయి విమర్శలు అనుచితమని సీతక్క స్పష్టం చేశారు.

కేటీఆర్, హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులపై మంత్రి సీతక్క ప్రత్యేకంగా ధ్వజమెత్తారు. మహిళలు సహజంగా ఎదుగుతున్నప్పుడు వారు ఓర్వలేకపోతూ, ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. "ఆడబిడ్డలు చీరలు తీసుకుని సంబరపడుతున్నారు. అది మీ కళ్లకు కనిపించడం లేదా? మహిళల సంతోషానికి మీరు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు" అంటూ సీతక్క ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సూరత్ నుంచి కిలోల లెక్కన చౌక చీరలు తెచ్చి పంపినట్టు తాము చేయలేదని, సిరిసిల్ల చేనేత కార్మికులు స్వయంగా నేసిన అత్యుత్తమ చీరలు మాత్రమే అందజేస్తున్నామని ఆమె వివరించారు. "కేటీఆర్, హరీశ్ రావు, కవితలు సిరిసిల్లకు వచ్చి చేనేతలను ప్రత్యక్షంగా అడిగి వివరాలు తెలుసుకోవచ్చు" అని సవాలు విసిరారు. ఈ విమర్శలు సిరిసిల్ల నేతన్నలను అవమానపరచడమేనని, అది తగినది కాదని సీతక్క హెచ్చరించారు.

మహిళా సంఘాలు, అందరికీ అవకాశం.. దుష్ప్రచారాలు ఆపాలి

చీరల పంపిణీ కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమేననే బీఆర్ఎస్ ఆరోపణలను మంత్రి సీతక్క తిరస్కరించారు. "సభ్యత్వం లేని మహిళలను కూడా సంఘాల్లో చేర్చుకుని చీరలు అందిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి చేసిన ప్రతి చర్యకు ప్రతిపక్షం ఓర్చుకోలేదు" అని ఆమె అన్నారు. గతంలో ఫ్రీ బస్సు పథకంపై 'బ్రేక్ డాన్స్' చేసుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు.

ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోవాలని సీతక్క సూచించారు. "మహిళలకు మంచి జరిగితే స్వాగతించడం, సంతోషించడం నేర్చుకోవాలి. అలాంటి మనస్తత్వం మార్చుకోకపోతే ప్రజలు తప్పకుండా గమనిస్తారు" అని హితవు పలికారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story