Minister Sridhar Babu: కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సమయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఇంజినీర్ల అవతారం ఎత్తి ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా ఆరోపించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్క ఎకరం సాగునీరు కూడా అందకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.25 లక్షల కోట్లను నీటిపాలు చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి భారాస శ్రేణులకు నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

భూపాలపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు, ప్రాజెక్టు నిర్మాణంలో వేల ఎకరాల పంట భూములు, ఇళ్లు మునిగిపోయి రైతులు తీవ్ర నష్టపోయారని గుర్తు చేశారు. కన్నెపల్లికి వచ్చి మాట్లాడుతున్న కేటీఆర్ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల మరమ్మతులకు జాతీయ సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టును సక్రమంగా వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం శ్రమిస్తుంటే, ప్రమాదకర బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని కేటీఆర్ చెప్పడం సరికాదని విమర్శించారు. అలా చేస్తే బ్యారేజీలు కూలిపోయి కింది ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదికను ఉటంకించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story