Minister Tummala: గోదావరి జలాలు సమర్థంగా వినియోగించాలి: మంత్రి తుమ్మల సూచన
మంత్రి తుమ్మల సూచన

Minister Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అధికారులతో కలిసి పడవలో వెళ్లి నీటి నిల్వ సామర్థ్యం పెంపు పనుల పురోగతిని సమీక్షించారు.
ఎల్‌నినో నేపథ్యంలో గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మంతోపాటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు తాగునీరు అందించేలా దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి నీరు నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. మీటరు ఎత్తు వరకు బస్తాలు మేటవేసి టీఎంసీ నీటిని నిల్వ చేస్తామని, అవకాశం ఉంటే మరో అర టీఎంసీ కూడా నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి తుమ్మల ఇలా అన్నారు: “ఎల్‌నినోను తక్కువగా అంచనా వేయొద్దు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్య ఉంది. 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయం, ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల్ని భయపెట్టడానికో, ఆందోళనకు గురిచేయాలనో ఇవి చెప్పట్లేదు. పరిస్థితుల్ని తట్టుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. మంచినీటి కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. సీఎం, నీటిపారుదల శాఖ మంత్రితో దుమ్ముగూడెం గురించి మాట్లాడిన వెంటనే పనులు మొదలుపెట్టాం.”

