Minister Vakiti Srihari: సబర్మతి నది ప్రక్షాళనలో 10 వేల మందిని తరలించారు: తెలంగాణ నాయకులు వెల్లడి
తెలంగాణ నాయకులు వెల్లడి
Minister Vakiti Srihari: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదిని 22 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేయడానికి గుజరాత్ ప్రభుత్వం 10 వేల మందిని తరలించినట్లు అక్కడి అధికారులు స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ మూవురూ విజయ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆదివారం అహ్మదాబాద్‌లో సబర్మతి నది పరీవాహక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడిన వారు, సబర్మతి నది నీటిని ప్రక్షాళన చేసి పంటలకు అందిస్తున్నారని, ఇది అక్కడి అభివృద్ధికి మంచి ఉదాహరణ అని చెప్పారు.
హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు భాజపా, భారాసలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.
సబర్మతి ప్రక్షాళనకు మూసీ ప్రక్షాళనకు ఎలాంటి సంబంధం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చెబుతున్నారని, అది అవాస్తవమని తమ పరిశీలనలో తేలిందని నాయకులు తెలిపారు. సబర్మతికి నర్మదా నది నుంచి నీళ్లు తెస్తుంటే, మూసీకి గోదావరి నుంచి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు.
2004 నుంచి 2014 వరకు సబర్మతి ప్రక్షాళనకు 10 వేల మందిని తరలించినట్లు గుజరాత్ అధికారులు చెప్పారని, కానీ ఎవరినీ తరలించలేదని రామచందర్ రావు అబద్ధాలాడుతున్నారని చామల, శ్రీహరి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన చేపట్టకుండా మురికికూపంలోనే బతకాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేస్తే ఎప్పటికీ సీఎంగా ఉండిపోతారనే భయంతో భాజపా, భారాస నేతలు వ్యతిరేకిస్తున్నారని చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు, రామచందర్ రావు సబర్మతి ప్రక్షాళన జరిగిన తీరును చూసి మాట్లాడాలని సూచించారు.
గుజరాత్ నమూనాలో తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధి: మంత్రి శ్రీహరి
గుజరాత్ తరహాలో తెలంగాణలో పాడి రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. రైతులకు ఆదాయం, మహిళలకు ఆర్థిక సాధికారత, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆదివారం అమూల్ పాల ఉత్పత్తి ప్లాంటును సందర్శించిన మంత్రి తదితరులకు జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి సీఎండీ మీనేష్ షా గుజరాత్‌లో పాడి అభివృద్ధి, అమూల్ పాల ఉత్పత్తి వివరాలు తెలియజేశారు. విజయ, మదర్ డెయిరీలకు సాయం అందించాలని మీనేష్ షాను మంత్రి, ఎంపీ, డెయిరీ ఛైర్మన్లు కోరారు.



