Medaram Jatara: మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ

Medaram Jatara: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆసియా అతిపెద్ద గిరిజన మహా జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రులిద్దరూ మేడారం ప్రసాదం సమర్పించి, జాతరను సందర్శించి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. కేసీఆర్ దంపతులు వచ్చిన మహిళా మంత్రులను అత్యంత ఆత్మీయంగా పలకరించారు. “బాగున్నారా.. అమ్మా..” అంటూ ఆప్యాయంగా అడిగారు. సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించి, తేనీటి విందుతో ఆతిథ్యం అందించారు.
మంత్రులు కూడా కేసీఆర్ దంపతుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.
మేడారం మహా జాతర ఈ ఏడాది భారీ ఏర్పాట్లతో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రముఖులను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టింది.

