కాంగ్రెస్ కమిటీ అధ్యక్షలుగా ఎమ్మెల్యేలు

కొన్ని చోట్ల కార్పొరేషన్‌ ఛైర్మన్లకూ ఇచ్చే అవకాశం

అత్యధికంగా కొత్త తరానికే పగ్గాలు

జూబ్లీహిల్స్‌లో మంచి మెజార్టీతో గెలుస్తాం

‘మంత్రుల పంచాయితీ’పై కేసీ.. సీఎంను అడిగారేమో తెలియదు..

కవిత పూర్తి నిజాలు చెప్పాలి.. ఆమె ఎవరో వదిలిన బాణం కావచ్చు

దిల్లీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యలు

MLAs Appointed as Congress Committee Presidents: ‘‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో 70% ప్రాంతంలో మురికివాడలు, మధ్యతరగతి ఆవాసాలే ఉన్నాయి. అక్కడి ప్రజలంతా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారు. మా అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 15 ఏళ్లుగా ప్రజలతో సత్సంబంధాలున్నాయి. కాంగ్రెస్‌ను బలపరిస్తే ప్రజలకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుంది’’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించేందుకు దిల్లీకొచ్చిన ఆయన ఆదివారం తెలంగాణభవన్‌లో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. ఆ వివరాలు ఇలా...

ఎమ్మెల్యేలకు డీసీసీ.. జోడు పదవుల కిందికి రాదు..

‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలో జాబ్‌మేళా కారణంగా.. డీసీసీలపై ఏఐసీసీ నాయకులతో సమావేశానికి రాలేకపోయారు. ఆయన తన అభిప్రాయాన్ని ప్రత్యేకంగా అధిష్ఠానానికి పంపుతారు. ఏఐసీసీ మార్గదర్శకాల ప్రకారం 50%కి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కుతాయి. ఇందులో అత్యధికంగా కొత్త తరం నాయకులే వస్తారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లనూ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి డీసీసీ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి పేర్లపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. వారిద్దరూ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నందున ఒకే కుటుంబానికి రెండు పదవులన్న సిద్ధాంతం వర్తించదు. కోమటిరెడ్డి సోదరులు కూడా అంతే. ఎమ్మెల్యేలకు డీసీసీ ఇవ్వడం.. జోడు పదవుల కిందికి రాదు. ప్రస్తుతం ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల పేర్లు డీసీసీలకు పరిగణనలో ఉన్నాయి.

బీసీలకు మేం పార్టీపరంగా 42% సీట్లు ఇచ్చినా.. ప్రత్యర్థి పార్టీలు ఇవ్వకపోతే దానికి విలువ ఉండదు. అందుకే రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం పోరాడుతున్నాం. మధ్యప్రదేశ్‌లో 72% రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న భాజపా.. రాష్ట్రంలో ఎందుకు అడ్డుపడుతోందో తెలియదు.

అందరం హైకమాండ్‌ రాడార్‌లో ఉన్నాం..

మంత్రుల పంచాయితీ గురించి కేసీ వేణుగోపాల్‌.. సీఎంను అడిగారేమో నాకు తెలియదు. కొండా సురేఖ కుమార్తె కులాల గురించి మాట్లాడటం సరికాదు. ఆమె మాటలను పట్టుకుని కేటీఆర్, హరీశ్‌రావు మా పార్టీని నోటికొచ్చినట్లు విమర్శించారు. పోలీసులు సుమంత్‌ అనే వ్యక్తిని వెతికే క్రమంలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కారణంగానే అక్కడికి వెళ్లారు తప్ప.. మంత్రి సురేఖ ఇంటిని లక్ష్యంగా చేసుకోలేదు. అది మంత్రి అధికార నివాసం కాదు. ఈ వివాదంపై అధిష్ఠానానికి వివరణ పంపాం. నాతో సహా అందరూ హైకమాండ్‌ రాడార్‌లో ఉన్నారు. ఎవరు తప్పు చేసినా చర్యలుంటాయి.

మెట్రోను పట్టించుకోని కిషన్‌రెడ్డి, సంజయ్

మతపరమైన వివాదాలతో తప్ప.. సొంతంగా చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే సత్తా భాజపాకు లేదు. మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాద్‌కు ఎంతో అవసరమైనా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ దాని గురించి మాట్లాడటం లేదు. తమిళనాడులో రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీలూ ఒక్కటై పోరాడుతున్నాయి. కానీ మన దగ్గర అలాంటి ధ్యాస లేదు. గుజరాత్‌లోని భాజపా ప్రభుత్వం సబర్మతి ఆధునికీకరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఎలాంటి పునరావాసం కల్పించలేదు. కానీ మేం మూసీ ఆధునికీకరణలో నిర్వాసితులయ్యే వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. దీనికి కేంద్రం రూపాయి కూడా ఇవ్వడం లేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story