MP Raghunandan Rao: బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఎంపీ రఘునందన్ రావు ఘాటు స్పందన
ఎంపీ రఘునందన్ రావు ఘాటు స్పందన

MP Raghunandan Rao: బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, దుబ్బాక నియోజకవర్గానికి హరీష్ రావు వల్ల జరిగిన అన్యాయం గురించి తాను ఎప్పుడో హెచ్చరించానని గుర్తు చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి ఓడిపోవడానికి గల కారణాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు అప్పుడే వివరించానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించిన విషయం కూడా తానే తొలిగా వెలికి తెచ్చానని చెప్పారు. కవిత తాజాగా చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి కొత్తదనం లేదని వ్యాఖ్యానించారు.
మోకిల్లా విల్లా ప్రాజెక్టుపై విచారణ కోరిన రఘునందన్
మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్టుపై సత్వరంగా విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై ఏసీబీ డీజీ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. నార్సింగిలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పని చేసిన సందీప్ రావు అర్హతలకుమించి వ్యవహరించారని ఆరోపించారు. సంతోష్ రావు వియ్యంకుడిగా ఉన్న సందీప్ రావు, సెటిల్మెంట్లలో కీలక పాత్ర పోషించాడని చెప్పారు. సందీప్ రావును కేసులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన రఘునందన్ రావు, ఆయనపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సంతోష్ రావు ఎలా ఈ స్థాయిలో ఆస్తులు కూడగట్టారో కూడా విచారించాలని డిమాండ్ చేశారు.
కవిత పార్టీలో కొనసాగాలా, బయటకు వెళ్లాలా అనే ఊగిసలాటలో ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించిన రఘునందన్ రావు, ఎంఎల్సీలపై ఆమె పార్టీలో ఉన్నప్పుడే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. నగర శివార్లలో ల్యాండ్ కన్వర్షన్ అంశంపై కూడా ఆమె స్పష్టత ఇవ్వాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో రెండు సంవత్సరాలు వృథా చేశారని, దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిందని మండిపడ్డారు.
తాను మెదక్ ఎంపీగా ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాకుండా, తనకు ప్రజల మద్దతే కారణమని స్పష్టం చేశారు. ఇది నూటికి నూరుపాళ్లూ నిజమని గట్టి ధీమా వ్యక్తం చేశారు.
