Rajagopalreddy : డోస్ పెంచిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తున్న అసంతృప్త ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

కాంగ్రెస్ అసంతృప్త శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నేరుగా అటాక్ చేయడం ప్రారంభించారు. ఇంతకాలం ఇన్‌డైరెక్ట్‌గా రాష్ట్ర నాయకత్వంపై సెటైర్లు వేసిన రాజగోపాల్‌రెడ్డి సీయం రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావిస్తూ తన విమర్శలను ఎక్కుపెడుతున్నారు. అంతే కాకుండా తాను గతంలో చేసిన వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసినవే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో శుక్రవారం రాత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రాజగోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పదవి వచ్చేటప్పుడు వస్తుంది.. పదవి రాకుండా మనల్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం పదవులు మీకే పైసలు మీకేనా అని నేను చేసిన వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నానని మీకందరికీ తెలుసు కదా అని తన విమర్శల డోసును పెంచారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నియోజవకర్గంలో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు జరగడం లేదు. పనులు చేయమని కాంట్రాక్టర్లను అడుగుతుంటే ముందు చేసిన పనులకు బిల్లులు చెల్లించమంటున్నారు. మంత్రిని అడిగినా పని అవ్వలేదు.. బిల్లులు చెల్లించడం సీయం రేవంత్‌రెడ్డి చేతిలో ఉంటుంది నాకు అన్యాయం చేసినా పరవాలేదు. నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్న మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం చేవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పదవులు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు… కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీయం రేవంత్‌రెడ్డి పరోక్షంగా రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో పది మంది పోటీ పడినా కుర్చీ ఒకరికే దక్కుతుందని, అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ రిజంబుల్ అయ్యేలా సీయం వ్యాఖ్యలు చేశారు. దీనికి టిట్ ఫర్ టాట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ పరోక్షంగా విమర్శలు చూస్తూ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్న రాజగోపాల్‌రెడ్డి ఇక నేరుగా రేవంత్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ప్రత్యక్ష విమర్శలు ప్రారంభించడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో అని అధికార పార్టీ శ్రేణులు ఉన్నాయి ఆందోళన చెందుతున్నాయి.
