NITIAayog: పత్తి ఉత్పత్తికి భారీ ఉత్సాహం అవసరం.. నీతి ఆయోగ్ సూచనలు
సూచనలు

NITIAayog: భారత వస్త్ర పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని చేరుకోవాలంటే పత్తి పంటకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. నాణ్యత పెంచడం, దిగుబడి పెంచడం, రైతులకు శిక్షణ ఇవ్వడం, జిన్నింగ్ మిల్లులను ఆధునీకరించడం వంటి బహుముఖ చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రపంచంలో భారత్ పత్తి ఉత్పత్తిలో 22 శాతం వాటా కలిగి ఉంది. నూలు ఎగుమతుల్లో 29 శాతంతో ముందంజలో ఉంది. అయినా ఏటేటా పత్తి ఉత్పత్తి తగ్గుతోంది. అస్థిర వాతావరణం, విత్తనాల ధరలు పెరగడం, చిన్న రైతులకు అవగాహన లేకపోవడం, చిన్న భూముల కారణంగా యంత్రాలు సరిగా వాడలేకపోవడం ప్రధాన సమస్యలు. గులాబీ రంగు పురుగు, పేనుబంక, రసం పీల్చే పురుగుల వల్ల పంట నష్టపోతోంది. ప్రస్తుత విత్తనాలు ఈ తెగుళ్లను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితంగా రైతులకు ఆశించిన లాభాలు రావడం లేదు.
పరిష్కార మార్గాలు ఇవే..
తెగుళ్లు, వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త తరం పత్తి విత్తనాలను దేశీయంగా అభివృద్ధి చేయాలి.
పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులపై దేశవ్యాప్తంగా రైతులకు శిక్షణ ఇవ్వాలి. మొబైల్ యాప్‌ల ద్వారా నేల పరీక్ష, కలుపు మందుల వాడకం వంటి ఉత్తమ పద్ధతులపై అవగాహన కల్పించాలి.
వాతావరణ అంచనా, తెగుళ్ల పర్యవేక్షణకు కృత్రిమ మేధను విస్తృతంగా వాడాలి.
2026-27 నుంచి రూ.2,500 కోట్లతో ప్రకటించిన ఐదేళ్ల ప్రత్యేక మిషన్‌ను సమర్థంగా అమలు చేయాలి.
పత్తి దిగుమతులపై ఉన్న సుంకం విషయంలో అవసరమైతే తాత్కాలిక మినహాయింపులు ఇచ్చి డిమాండ్‌ను తీర్చాలి.
జిన్నింగ్ మిల్లుల్లో 64 శాతం మిల్లులు కపాస్‌ను శుభ్రం చేయకుండానే జిన్నింగ్ చేస్తున్నాయి. నాణ్యత పెంచేందుకు అన్ని మిల్లులను నవీకరించాలి.
పత్తి జౌళి రంగం లక్ష్యాల సాధనకు కీలకం. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరిస్తేనే భారత్ ప్రపంచ వస్త్ర మార్కెట్‌లో మరింత బలంగా నిలబడగలదని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.

