Sridhar Babu: సింగరేణి ప్రైవేటీకరణకు నో ఛాన్స్.. అడ్డుకుని తీరుతాం! కేటీఆర్‌పై శ్రీధర్‌బాబు ఫైర్
శ్రీధర్‌బాబు ఫైర్

Sridhar Babu: సింగరేణి కాల్లరీస్ కంపెనీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, చేయబోమని, చేయనివ్వమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఘాటుగా స్పందించారు.
“12 ఏళ్ల తర్వాత కేటీఆర్‌కు సింగరేణి గుర్తుకు వచ్చిందా?” అని ప్రశ్నించిన మంత్రి, సింగరేణిని బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. గత పదేళ్లు సంస్థను కేటీఆర్ కుటుంబ సభ్యులే నడిపారని, బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని, సింగరేణిని కాపాడింది గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో కార్మికులు ఇబ్బంది పడ్డారని, వారి సంక్షేమం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేటు సంస్థకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రైవేటీకరణ చూసినవారు ఇప్పుడు మాట్లాడటం సరికాదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి టెండర్లు పారదర్శకంగా జరుగుతున్నాయని, అందుకే కొన్ని శక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన టెండర్ విధానమే ఇప్పుడు కొనసాగుతోందని, అప్పుడు తప్పు కానిది ఇప్పుడు ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. గతంలో కాంట్రాక్టులన్నీ బీఆర్ఎస్ అనుచరులకే కట్టబెట్టారని, కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులే లేరని చెప్పినా ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు దసరా బోనస్ ఇస్తోందని తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ప్రతి సంవత్సరం 14 మిలియన్ టన్నుల బొగ్గు అవసరమని, దానికి అనుగుణంగా ఉత్పత్తి పెంచకపోవడం, కొత్త గణులపై దృష్టి సారించకపోవడం బీఆర్ఎస్ వైఫల్యమేనని మంత్రి నిలదీశారు. ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రికి బొగ్గు సరఫరా చేస్తున్నామని, యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. జీ9 బొగ్గు సరఫరా కొనసాగుతుందని, బొగ్గు మాయం అనేది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేశారు.
కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికిన మంత్రి శ్రీధర్‌బాబు, సింగరేణిని ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తామని అంటే ఊరుకోమని హెచ్చరించారు.

