Deputy CM Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ నిధుల ఖర్చులో జాప్యం వద్దు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం కేటాయించిన నిధుల వినియోగంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆర్థిక, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులతో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల వినియోగం, శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటివరకు జరిగిన వ్యయం, రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.
శాఖల వారీగా నిధుల ఖర్చులో ఉన్న అంతరాలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలతో ఆర్థికశాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, ఖర్చుల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. మొదటగా ఖర్చులో బాగా వెనుకబడిన వ్యవసాయం, వైద్యం, ఇంధనం, పురపాలక, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం, పరిశ్రమలు, గిరిజన సంక్షేమం శాఖల కార్యదర్శులతో, తరువాత క్రమంలో ఇతర శాఖల అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, వ్యయం, మిగిలిన నిధుల వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి నివేదిక రూపొందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆర్థికశాఖలో అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణకు చేపడుతున్న చర్యలు, రుణాల పునర్వ్యవస్థీకరణపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఆర్థిక నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించేందుకు అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు, ఆర్థికరంగ నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

