Meenakshi Natarajan: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన కార్యాలయంలో ఆమె ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశమై ‘సర్‌’ అమలు ప్రగతి, క్షేత్రస్థాయి వివరాలు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో సొంత కార్యక్రమాలను మాత్రమే ప్రచారం చేసుకోవడం సరికాదని, ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్‌ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని మీనాక్షి నటరాజన్‌ నిలదీశారు.

ప్రతి నియోజకవర్గంలో ‘సర్‌’ కార్యక్రమం అమలు తీరుపై తన వద్ద ఉన్న వివరాలతో ఆమె పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. వరంగల్‌ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ‘సర్‌’పై ఎందుకు వెనుకబడ్డారని ఎంపీ కడియం కావ్యను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కావ్య, తన లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా తిరిగి స్థానిక నేతలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు.

మీనాక్షితో భేటీ అనంతరం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ వర్గాల మధ్య గొడవలపై మీనాక్షి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలని ఆయన బాధ్యత తీసుకున్నట్లు వివరించారు.

ఎంపీ బలరాం నాయక్‌ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందని మీనాక్షి అడిగినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తాను ఆమెకు చెప్పానన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ప్రతిపక్షాల ఆరోపణలను సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టాలని మీనాక్షి సూచించినట్లు వెల్లడించారు.

‘సర్‌’ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేసుకోవాలని మీనాక్షి నటరాజన్‌ ఆకాంక్షించారు.

Next Story