అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి

CM Revanth Reddy: ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల ప్రక్రియను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.

“గన్నీ బ్యాగులు, హమాలీల కొరత ఏ మాత్రం లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలి. ఒప్పందం ప్రకారం సరిపడా లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై వీలైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడొద్దు” అని సీఎం హెచ్చరించారు.

ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం చూపితే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిక జారీ చేశారు.

గోదాముల సమస్య ఉన్న చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని, రైతుబజార్లు, ఫంక్షన్‌ హాళ్లను వినియోగించి ధాన్యం నిల్వ చేయాలని సూచించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా ఉత్పత్తి అయ్యే జిల్లాల్లో కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు సహాయం తీసుకొని సేకరణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కొనుగోళ్ల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎస్‌కు పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story