Telangana CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్ర సర్వేకు అభ్యంతరం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి

ముంపు భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం
నిర్మాణ ప్రాంతంలో మార్పు ఉండదని స్పష్టం
Telangana CM Revanth Reddy: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ‘‘తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించండి. 148, 152 మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఏ స్థాయిలో ఎంత ముంపు ఉంటుందనేదానికి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి. ఆ రాష్ట్రంతో ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను, సమాచారాన్ని మహారాష్ట్రకు అందజేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. దీనికోసం అవసరమైన నిధులను ఆ రాష్ట్రంతో కూడిన జాయింట్ బ్యాంకు ఖాతాలో ఉంచుతామని పేర్కొన్నారు. భూముల ముంపుపై మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా అభ్యంతరం లేదని, అధికారులకు కావాల్సిన సమాచారాన్ని ఇంజినీర్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి మార్పు ఉండదని సీఎం స్పష్టం చేశారు. బ్యారేజీ ఎత్తు గురించి మాత్రమే చర్చ జరుగుతోందని, డిజైన్‌లో మార్పు వల్ల ముంపు తగ్గిందని, నిర్మాణ ప్రాంతంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని, ఉండబోదని చెప్పారు. 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
2014 మార్చి 24న మహారాష్ట్ర-తెలంగాణ మధ్య జరిగిన చర్చల్లోనే నిర్మాణ ప్రాంతంపై ఒప్పందం జరిగిందని, తర్వాత స్టాండింగ్ కౌన్సిల్, అంతర్ రాష్ట్ర బోర్డు, ముఖ్యమంత్రుల సమావేశంలో 2016లో అంగీకారం జరిగిందని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుత చర్చ అంతా బ్యారేజీ ఎత్తుపైనే ఉందని, దీనికి మహారాష్ట్రను అంగీకరింపజేయడానికి అవసరమైన సమాచారం అందించాలని, గతంలో జరిగిన అన్ని ఒప్పందాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ రమేశ్, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

