CM Revanth Reddy Confident: “తెలంగాణ రైజింగ్ ఎవరూ ఆపలేరు.. ఇదే మన భవిష్యత్తు!” – సీఎం రేవంత్ రెడ్డి ధీమా
ఇదే మన భవిష్యత్తు!” – సీఎం రేవంత్ రెడ్డి ధీమా

CM Revanth Reddy Confident: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేదే మా ఆశయమని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయమని రేవంత్‌రెడ్డి తెలిపారు.
గ్వాంగ్‌డాంగ్ నమూనా అమలు చేయదలిచాం
సమిట్‌లో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ‘‘లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం మాకుంది. అందరి సహకారంతో మా లక్ష్యాన్ని అందుకుంటాం. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైంది. దేశంలోనే తెలంగాణ కొత్త రాష్ట్రం. దేశ జనాభాలో 2.9 శాతమే ఉన్నా.. 5 శాతం ఆదాయం ఇస్తున్నాం. ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించాం. వాటిని సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించాం. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నాం. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నాం. అది 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించింది. ఇక్కడ కూడా గ్వాంగ్‌డాంగ్ నమూనా అమలు చేయదలిచాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ మాకు ఆదర్శం’’ అని ప్రస్తావించారు.
ఈ సమిట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశలు వెలుగొంటాయని, ప్రపంచ దేశాలతో సంబంధాలు బలపడతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సమిట్‌లో పాల్గొన్న ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ లక్ష్యాలకు మద్దతు తెలపడంతో ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

