Minister Ponguleti: భారాస హయాంలో పేదల గోడు వినేవారు కరవయ్యారు: మంత్రి పొంగులేటి ధ్వజం
మంత్రి పొంగులేటి ధ్వజం

Minister Ponguleti: గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలు వినేవారు కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి పేదలను మోసం చేశారని ఆరోపించారు.
బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై వినతులు స్వీకరించారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు సహా సుమారు 400 దరఖాస్తులు అందాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ధరణిలో భూములు ఇతరుల పేరుపై నమోదు చేసిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
ఇందిరమ్మ ఇళ్లు: గతంలో ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు పేదవాడు పుట్టి, పెరిగిన చోటే ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని, ఇంటి స్థలంలో అన్‌డివైడెడ్ షేర్ కూడా కల్పిస్తామని చెప్పారు. ఇంటి విలువ రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని, 10 సంవత్సరాల వరకు అమ్ముకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు. బ్యాంకు రుణం నాలుగు విడతలుగా చెల్లించవచ్చని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడతామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

