Congress State In-Charge Meenakshi Natarajan: దేశంలో ఓట్లు, సీట్లతోపాటు పార్టీల చోరీ కూడా జరుగుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ఆరోపించారు. హనుమకొండలో కాంగ్రెస్‌ బీఎల్‌ఏలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇటీవల ఒక పార్టీకి చెందిన 20 మంది, మరో పార్టీకి చెందిన 9 మంది, ఇంకో పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను కొనుగోలు చేసి ఆయా పార్టీల్లో చీలికలు తీసుకొచ్చారు. సర్‌ (Special Intensive Revision) ప్రక్రియ దేశంలో ఇదే మొదటిసారి కాదు. జేఎం లింగ్డో ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు మూడు విడతల్లో పారదర్శకంగా చేపట్టారు. కానీ ప్రస్తుతం ‘సర్‌’ ముసుగులో ఇతర పార్టీల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్రం కార్యాచరణ అమలు చేస్తోంది’’ అని మీనాక్షి నటరాజన్‌ అన్నారు.

బెంగాల్‌లో ఓట్ల చోరీ ద్వారానే భాజపా గెలిచిందని, రాజ్యసభ ఎన్నికలకు తన నామినేషన్‌ను ఎన్నికల అధికారితో కలిసి తిరస్కరించేలా చేశారని ఆమె ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చే కుట్రలు చేస్తున్నారని, పౌరుల ఓట్లను గల్లంతు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ, ‘‘సర్‌ పేరుతో భాజపా వ్యతిరేకుల ఓట్లను తొలగిస్తోంది. ఎఫ్‌ఐఆర్, క్రైం నంబరు లేకుండా మీనాక్షి నటరాజన్‌ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం భాజపా కుట్రలకు నిదర్శనం. నరేంద్ర మోదీ, అమిత్ షాలు రాజ్యాంగ విలువలు పాటించడం లేదు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ దోచుకున్నారు. తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్న సంకేతంగా భావిస్తున్నారు.

Next Story