మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చి.. అక్కడి సామాన్య జనంలో జ్ఞాన కాంతులు ప్రసరింపజేస్తోన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ వాసి పరికిపండ్ల నరహరి రాసిన 'ఓబీసీల పోరుబాట' పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి.. ఓవైపు.. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా సేవలందిస్తూనే.. మరోవైపు.. ఓబీసీల్లో చైతన్యం కోసం చేస్తున్న కార్యక్రమాలు హ్యాట్సాఫ్‌ అని పలువురు వక్తలు, అతిథులు కొనియాడారు.



ఈ పుస్తకావిష్కరణ సభలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, దాసోజు శ్రవణ్‌, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ ఈరవర్తి అనిల్‌, తెలంగాణ వాటర్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వి. ప్రకాష్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కృష్ణమోహన్‌రావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చిరంజీవులు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ పూర్ణ చంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీలు, సంఘాలకు అతీతంగా హాజరైన అతిథులు ఐఏఎస్‌ అధికారి నరహరి వ్యక్తిత్వాన్ని, ఆయన సమాజంలో విజ్ఞాన కాంతులు వెదజల్లేందుకు చేపడుతున్న చర్యలను కొనియాడారు.



దేశంలోని బీసీలందరూ సంఘటితంగా అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పుస్తకంలో నరహరి చక్కగా వివరించారని వక్తలు కొనియాడారు. ఓబీసీలు ఆర్థికంగా, సామాజికంగా కాస్త ముందు వరుసలోకి వచ్చినా రాజకీయంగా మాత్రం వెనుకంజలో ఉన్నారు. దేశంలో 80 కోట్ల ఓబీసీల ఆశయాలు, ఆశలు, సమస్యలు, వాటి పరిష్కారాలపైనే ఈ పుస్తకంలో చర్చించారన్నారు. జన గణనలో ఈసారి కుల గణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. దేశంలో ఓబీసీల పోరాటానికి ఈ పుస్తక రచయిత, ఐఏఎస్‌ అధికారి పరికిపండ్ల నరహరి ముందుండి నాయకత్వం వహించాలని వక్తలందరూ ఆకాంక్షించారు.




Politent News Web4

Politent News Web4

Next Story