సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు అనివార్యం

సమన్వయంతో, సామర్థ్యంతో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు సాధ్యమే

అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఇక కాదు

కేంద్ర పథకాల నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి

అన్ని శాఖల సెక్రటరీలతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం

CM Revanth Reddy Issues Key Directives: ప్రభుత్వం ఎంతో ఉత్సాహంతో రూపొందించిన కార్యక్రమాలు పూర్తి విజయం సాధించాలంటే అధికారుల సమర్థవంతమైన సహకారం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి పనితీరు కంటే మరింత మెరుగైన ప్రదర్శన చూపాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.

సచివాలయంలో మంగళవారం అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు సహా సీఎంఓ అధికారులు హాజరయ్యారు. ‘‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలి. క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి కార్యక్రమాలకు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. శాఖల మధ్య సమన్వయం, సామర్థ్యం ఉంటే 2047 లక్ష్యాలు సులువుగా సాధ్యమవుతాయి’’ అని ఆయన పునరుద్ఘాటించారు.

గత రెండేళ్లలో కొన్ని ముఖ్యమైన విజయాలు సాధించామని, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎనర్జీ వంటి శాఖలకు స్పష్టమైన పాలసీలు తీసుకొచ్చామని సీఎం గుర్తుచేశారు. ఇకపై ప్రతి నెలా కార్యదర్శుల పనితీరుపై సమీక్ష ఉంటుందని, వారు చీఫ్ సెక్రటరీకి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వయంగా సమీక్ష చేస్తానని తెలిపారు. ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయికి తరచూ వెళ్లి పరిశీలన చేయాలని, నెలలో కనీసం మూడుసార్లు శాఖల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.

రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి పూర్తి వివరాలు జనవరి 26లోగా సమర్పించాలని ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఈపీఎఫ్ సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించాలని చెప్పారు.

సొంత భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు ఇక అద్దె భవనాల్లో ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. జనవరి 26లోగా అద్దె భవనాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని, లేకపోతే సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 113 మున్సిపాలిటీల్లో అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల వివరాలు సమర్పించాలని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.

డిజిటల్ పరిపాలనకు ప్రాధాన్యం

కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఇక ఉండకూడదని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, మెడికల్ కాలేజీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక సేవలకు ప్రోత్సాహకాలు అందించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని, శాఖల మధ్య సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story